దేవరుప్పుల, జూన్ 21 : వంట నూనెల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ తోటల పెంపకానికి రైతులను ప్రోత్సహించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో ప్రవాస తెలంగాణవాసి ఏర్పాటుచేసిన ఓజాస్ నేచురల్ ఫుడ్స్ ఇండస్ట్రీని ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. భారత్ మార్కెట్లో వంట నూనెలు పూర్తి గా కల్తీమయమైన దశలో కేసీఆర్ పామాయిల్ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశలో రైతులకు అనేక రకాల సబ్సిడీలు ఇవ్వడమేకాక, స్ధానికంగానే ఆయిల్ ఇండస్ట్రీలు ఏర్పాటుచేశారని చెప్పారు. రైతులు సానుకూలంగా స్పదించి వేలాది ఎకరాల్లో పామాయిల్ పెంపకాన్ని చేపట్టారని, వాటి ఉత్పత్తులను నేడు రైతులు స్థానికంగానే విక్రయిస్తున్నారని తెలిపారు. మామిడి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ తోటలను సాగు చేసేందుకు వేలాదిమంది రైతులు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. మరో పదేండ్లలో వంట నూనెల ఉత్పత్తులకు తెలంగాణ కేంద్ర బిందువు కానున్నదని వెల్లడించారు. ఎర్రబెల్లి వెంట పోకర్నా గ్రానైట్ చైర్మన్ గౌతమ్‌జీ, క్వార్డ్రెంట్ సీఈవో వంశీరెడ్డి, వ్యాపారవేత్త కాల్వల అజయ్ ఉన్నారు.
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఆదివా రం జరిగిన మన అమెరికా తెలుగు సంఘం (మాటా) మహాసభలకు ఎర్రబెల్లి హాజరయ్యారు. మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనుగోని, ప్రదీప్ శ్యామల ఎర్రబెల్లికి స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచం నలుదిశలా చాటి చెప్పేందుకు అనునిత్యం మాటా కృషిచేస్తున్నదని చెప్పారు. అనంతరం ప్రముఖులకు ఎక్సలెన్సీ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో సినీనటులు సుమన్, జయప్రద, ఆలీ, నిఖిల్, ఐశ్వర్యారాజేశ్, మాటా ప్రెసిడెంట్ కిరణ్ దుంగిడి, 2వ కన్వెన్షన్ కన్వీనర్ శ్రీధర్ గుండాల, పొలిటికల్ ఫోరం చైర్మన్ భాస్కర్ పిన్న పాలొన్నారు.
డల్లాస్ నగరం ప్రిస్కోలో పీఎంజే జ్యువెలరీని ఆ సంస్థ చైర్మన్ కుశాల్జైన్తో కలిసి ఎర్రబెల్లి ప్రారంభించారు. వినియోగదారులకు కుశాల్జైన్ నాణ్యమైన సేవలందిస్తున్నారని ఎర్రబెల్లి కొనియాడారు. కార్యక్రమంలో ఆటా ప్రెసిడెంట్ సతీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి, వంశీరెడ్డి పాల్గొన్నారు.