హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని 5లక్షల ఎకరాలకు పెంచాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆకస్మికంగా ఆయిల్‌ఫెడ్‌ను సందర్శించిన తుమ్మల.. ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేసి.. రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించేలా కృషి చేయాలని కోరారు.
ఆయిల్‌పాం నర్సరీలపై మరింత పర్యవేక్షణ పెంచడంతోపాటు, నర్సరీలోనే మొకల నాణ్యతను గుర్తించాలని తెలిపారు. రైతులకు అంతర్ పంటల విషయంలో సరైన అవగాహన కల్పించాలని, అందుకు వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారం తీసుకోవాలని సూచించారు. జూలై నాటికి సిద్దిపేట జిల్లాలో నిర్మితమవుతున్న నర్మెట్ట ఆయిల్‌పాం ఫ్యాక్టరీని పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయిల్‌ఫెడ్ ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులను కూడా మారెటింగ్ చేసి సంస్థను ప్రగతిపథంలో నడిపించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఈడీ ప్రశాంత్‌కుమార్, ఓఎస్డీ కిరణ్‌కుమార్, జీఎం సుధాకర్‌రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.