KCR | సిద్దిపేట, జూన్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ సాగు సంకల్పం ఒక్కొక్కటిగా ఫలితాలనిస్తున్నది. ఆయన ముందుచూపుతో తెచ్చిన ఎన్నో విప్లవాత్మక పథకాలు నేడు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. కేసీఆర్ దూరదృష్టితో తీసుకొచ్చిన ఆయిల్‌పామ్ ప్రోత్సాహక విధానాలు రైతులకు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చి పెడుతుండగా, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఏర్పాటుచేసిన ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ విజయవంతంగా కొనసాగుతున్నది.
ఒకప్పుడు వరి, మక్క, పత్తి వంటి సంప్రదాయ పంటలకే పరిమితమైన రైతాంగం నేడు ఆయిల్‌పామ్ సాగుతో కొత్త ఆర్థిక బలాన్ని సంతరించుకుంటున్నది. నర్మెట ఫ్యాక్టరీ రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తున్నది. ఆయిల్‌పామ్ పంటపై రైతుల్లో తొలుత అనేక సందేహాలు ఉండేవి. పండించిన తర్వాత అమ్మకాలపై రైతుల్లో ఆందోళన ఉండేది. నాడు కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అప్పటి మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిరంతర కృషి, చొరవతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నర్మెటలో ఏర్పాటైంది. దీంతో రైతుల్లో ఆ భయాలు పటాపంచలయ్యాయి.
రైతులు పండించిన తాజా గెలలను నేరుగా ఫ్యాక్టరీకి తరలించే అవకాశం ఉండటంతో మారెటింగ్ సమస్య లేకుండా పోయింది. సంప్రదాయ పంటల్లో వాతావరణ మార్పులు, పెరుగుతున్న పెట్టుబడులు, మార్కెట్ ధరల ఒడిదుడుకులతో రైతులు నష్టాలను ఎదురొంటున్నారు. ఆయిల్‌పామ్ పంటలో ఒకసారి పెట్టుబడి పెడితే ఏండ్లపాటు దిగుబడి లభిస్తుంది. దీంతో ఆదాయం గణనీయంగా పెరిగిందని రైతులే చెప్తున్నారు. కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతోపాటు వ్యవసాయంపై మళ్లీ నమ్మకం పెరిగింది.
నర్మెట ఫ్యాక్టరీ రైతులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఉపయోగపడుతున్నది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. ప్రత్యక్ష్యంగా 500 మందికి పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి దొరుకుతున్నది. రవాణా, కార్మిక పనులు, నర్సరీలు, వ్యవసాయ సేవల ద్వారా వందలాది కుటుంబాలకు జీవనోపాధి లభిస్తున్నది. ముందు పంట పండించినా అమ్మకాల కోసం తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఫ్యాక్టరీ ఉండటంతో పంటకు గ్యారెంటీ మారెట్ సదుపాయం ఉన్నది. దేశంలో వంటనూనెల అవసరాలకు భారీగా విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్నది. ఆయిల్‌పామ్ సాగు విస్తరించడం ద్వారా దేశీయ ఉత్పత్తి పెరిగి దిగుమతుల భారం తగ్గే అవకాశం ఉన్నది.
నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగింది. ఈ జిల్లాలో 2022-23 ఆయిల్‌పామ్‌కు శ్రీకారం చుట్టారు. 2025 సెప్టెంబర్‌లో ఫ్యాక్టరీ ట్రయల్న్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 31,698.01 మెట్రిక్ టన్నుల క్రషింగ్ చేయగా, 5,521.86 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పతి అయింది. ఇప్పటివరకు జిల్లాలో 14,000 ఎకరాల్లో పామాయిల్ పంట సాగయ్యింది.
5,800 ఎకరాల్లో గెలలు ప్రస్తుతం కోత దశకు వచ్చాయి. 2026-27లో 4,000 ఎకరాల సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 600 ఎకరాల్లో సాగు పనులు జరుగుతున్నాయి. నర్మెట కర్మాగారం సిద్దిపేట జిల్లాతోపాటు పరిసర జిల్లాలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. రోజూ 800 నుంచి 1,000 టన్నుల వరకు గెలలు వస్తున్నాయి. ప్రస్తుతం గంటకు 30 టన్నుల వరకు క్రషింగ్ సామర్థ్యం ఉన్నది. మున్ముందు గంటకు 120 టన్నుల సామర్థ్యానికి పెంచాల్సి ఉన్నది. ఏడాది పొడవున ఫ్యాక్టరీ నడుస్తూనే ఉంటుంది.
4 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేసిన బయో పవర్‌ప్లాంట్‌తో అవసరాల మేరకు విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఏడాదిలో లక్ష టన్నుల క్రషింగ్ లక్ష్యాన్ని పెట్టుకొన్నారు. ఈ ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని మార్చి 22న ప్రారంభించారు. ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం నుంచి ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో ప్రాసెసింగ్ జరిగింది. 25,890 మెట్రిక్ టన్నుల తాజా పామ్ పండ్ల గుత్తులు ప్రాసెసింగ్ చేశారు. వాటి నుంచి 4,612.305 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్‌ను ఉత్పత్తి చేశారు.
2,370 మెట్రిక్ టన్నుల పామ్ గింజలు ప్రాసెసింగ్ చేయగా వాటి నుంచి 396.145 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ కర్నెల్ను ఆయిల్ ఉత్పత్తి చేశారు. 12,966 కిలోలీటర్ల వ్యర్థ జలాలను శుద్ధి చేశారు. 63 మెట్రిక్ టన్నుల పౌడర్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ పక్కనే రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.40 కోట్లతో రిఫైనరీ నిర్మాణం చేపడుతున్నారు. పామాయిల్ పండ్ల గుజ్జు నుంచి క్రూడ్ పామాయిల్‌ను తీసి రిఫైన్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి నేరుగా పంపిస్తారు.
ఇక్కడ గంటకు 25 టన్నుల పామాయిల్‌ను ప్యాకింగ్ చేస్తారు. నర్మెట ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీకి జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి ప్రాసెసింగ్ కోసం తెచ్చిన తాజా పండ్లు సుమారు 1,000 మెట్రిక్ టన్నుల వరకు ర్యాంప్ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల నుంచి కూడా ఇక్కడికి భారీగా పండ్ల గుత్తులు రవాణా అవుతున్నాయి.
నర్మెట ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ నాలుగు నెలలుగా విజయవంతంగా నడుస్తూ రైతులకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నది. రైతులు ఇప్పుడు స్థిరమైన ఆదాయం పొందుతూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో వంటనూనెల దిగుమతులను తగ్గించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు.. రాష్ట్ర రైతాంగానికి వరంగా మారింది.
రైతులు పండించిన తాజా గెలలను నేరుగా విక్రయించే అవకాశం ఉండటంతో మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు సరైన ధర లభిస్తున్నది. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు కొన్ని సమస్యలున్నాయి. సాగునీటి లభ్యత, ఎరువుల ధరలు, సాంకేతిక సలహాలు, గెలల సేకరణ కేంద్రాల పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.
ఫ్యాక్టరీలో తాజా పండ్ల గుత్తుల ప్రాసెసింగ్ పూర్తిగా ఆవిరి, యాంత్రిక ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. తాజా పండ్ల గుత్తులను ముం దుగా స్టెరిలైజర్‌లో ఆవిరి ద్వారా శుద్ధిచేస్తారు. అనంతరం త్రెషర్ ద్వారా పండును గుత్తి నుంచి వేరు చేసి, డైజెస్టర్, ప్రెస్ యంత్రం ద్వారా నూనె బయటకు వస్తుంది. అనంతరం శుద్ధి ప్రక్రియ ద్వారా ముడి పామాయిల్‌ను వేరు చేస్తారు.
ఈ ప్రక్రియలో ఎటువంటి హానికరమైన రసాయనాలను ఉపయోగించరు. మొత్తం ప్రక్రియ సేంద్రియ, ఆవిరి ఆధారంగా మాత్రమే కొనసాగుతుంది. శుద్ధి సమయంలో పండు నుంచి సహజసిద్ధమైన ఆవిరి, వాసన విడుదల అవుతుంది. ఈ వాసన అనేది ఆవిరి, సేంద్రియ పండు ప్రాసెస్ కారణంగా మాత్రమే ఉండి, ఆరోగ్యానికి ఎటువంటి హానికరమైన ప్రభావం ఉండదు.
