Anganwadi Centers | హైదరాబాద్, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌ను పక్కనపెట్టి ప్రైవేటుకు పట్టం కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధులు పావులు కదుపుతున్నట్టుగా తెలిసింది. ఆయిల్‌ఫెడ్ స్థానంలో నల్లగొండకు చెందిన ఓ కాంగ్రెస్ కార్యకర్తకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఓ మంత్రితో చర్చలు పూర్తికాగా ‘ఒప్పందం’ కూడా జరిగినట్లుగా తెలిసింది. ఇది తమకు అప్పగిస్తే అన్ని విధాల ‘చేయూత’ ఇస్తామని సదరు సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లుగా తెలిసింది. దీంతో ఆయిల్‌ఫెడ్‌కు ఎగనామం పెట్టి సంస్థ ఆదాయానికి గండి కొట్టి ప్రైవేటు సంస్థకు పచ్చజెండా ఊపినట్టుగా తెలిసింది.
ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్ కొన్నేళ్లుగా అంగన్వాడీ కేంద్రాలకు ఐదు రకాల సరుకుల కిట్‌ను సరఫరా చేస్తున్నది. ‘విజయ’ బ్రాండ్ పేరుతో నాణ్యమైన సరుకులతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రక్రియ సాగుతున్నది. ఇక విజయ ఆయిల్‌ను గడిచిన 20 ఏళ్లుగా సరఫరా చేస్తుండడం గమనార్హం. అంగన్వాడీలకు విజయ ఆయిల్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు(జీవో) కూడా జారీ అయ్యాయి. సరుకుల సరఫరా ద్వారా సంస్థకు కొంత ఆదాయం సమకూరుతున్నది. ఇప్పుడు ఈ ఆదాయానికి గండికొట్టే కుట్రలు జరుగుతుండడం గమనార్హం. ప్రభుత్వ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ప్రైవేటు జేబులోకి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే ఈ ఆదాయంపై ఓ కాంగ్రెస్ కార్యకర్త కన్ను పడినట్లుగా తెలిసింది. అంతే సదరు వ్యక్తి ఓ మంత్రి అండతో సరుకుల సరఫరాను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి మంత్రికి అవాస్తవాలను నూరిపోసినట్లుగా తెలిసింది. ముఖ్యంగా మంత్రిని ఒప్పించేందుకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న సరుకుల నాణ్యతపై తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. సరుకుల నాణ్యత సరిగ్గా లేదని, అందుకే తమకు ఇస్తే మంచి సరుకులు సరఫరా చేస్తామని నమ్మబలికినట్లు తెలిసింది. దీంతో పాటు ‘సహకారం’ అందించేందుకు ముందుకొచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తొలి దశలో సదరు కాంగ్రెస్ కార్యకర్తకు కొంత మేర సరఫరా బాధ్యతను అప్పగించేందుకు అంగీకరించినట్లుగా తెలిసింది. తద్వారా ప్రభుత్వ సంస్థను పూర్తిగా పక్కకు పెట్టారనే విమర్శలు, ఆరోపణలు రాకుండా ‘50-50’ ప్లాన్ వేసినట్లుగా తెలిసింది. ఆ తర్వాత మెల్లిగా పూర్తిగా ఆయిల్‌ఫెడ్‌ను పూర్తిగా పక్కనపెట్టి.. సదరు కార్యకర్త సంస్థకు మొత్తం సరఫరాను కట్టబెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిసింది.
అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరా బాధ్యతను ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్‌కు కాకుండా ప్రైవేటు సంస్థకు అప్పగించాలనే నిర్ణయం… సరుకుల నాణ్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సరుకుల సరఫరాలో ప్రభుత్వరంగ సంస్థకు ఓ బాధ్యత ఉంటుంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైనా అడిగే వీలుంటుంది. అదే ప్రైవేటు సంస్థ అంత బాధ్యతగా వ్యవహరిస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తు తం ఆయిల్‌ఫెడ్ ద్వారా సరఫరా చేసే సరుకుల నాణ్యతను పలు దశల్లో పరీక్షించి అన్ని విధాలా సర్టిఫికెట్లను తీసుకున్న తర్వాతే కేంద్రాలకు సరఫరా చేస్తారు. దీంతో సరుకుల నాణ్యతపై సందేహాలు ఉండేవి కావు. కానీ ఇదే ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే.. లాభాపేక్షే ధ్యే యంగా పని చేసే ప్రైవేటు సంస్థ ఆయిల్‌ఫెడ్ స్థాయిలో సరుకుల నాణ్యతను పాటిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకులు అందుతాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాను 50 శాతం ఆయిల్‌ఫెడ్‌కు, మరో 50శాతం ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో సరుకుల సరఫరాలో ప్రభుత్వ సంస్థను పక్కనపెట్టి ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థను పక్కనపెట్టి ప్రైవేటు సంస్థకు అది కూడా కాంగ్రెస్ కార్యకర్త సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఏంటని ఆయిల్‌ఫెడ్ ఉద్యోగులు ప్ర శ్నిస్తున్నారు. ఈ విధంగా తమ అవకాశాలను, వ్యాపారాలను దెబ్బతీయాలనుకోవడం దారుణమని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్ర భుత్వం పునరాలోచన చేసి అంగన్వాడీలకు సరుకుల సరఫరాను గతంలో మాదిరిగానే పూర్తిగా ఆయిల్‌ఫెడ్‌కే ఉండేలా చూడాలని కోరుతున్నారు. లేని పక్షంలో ప్రభుత్వరంగ సంస్థలు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.