సమాచారం ఇవ్వరు.. సమాధానం చెప్పరు.. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయరు.. స.హ చట్టం దరఖాస్తులను ఖాతరు చేయరు.. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నమని చెప్తరు తప్ప అసలు ఎన్ని ఇండ్లు కూల్చిండ్రు? వాటికైన ఖర్చెంత? ఇప్పటివరకు హైడ్రాకు విడుదలైన నిధుల్లో ఎంతమేరకు ఖర్చు పెట్టిండ్రో? చెప్పాలని అడిగితే హైడ్రా అధికారులు వివరాలు ఇవ్వకుండా ముఖం చాటేస్తరు. ‘ఇవేమైనా రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలా? దేశభద్రతకు సంబంధించిన వివరాలా? ఎందుకివ్వరు?.. హైడ్రా ఏమైనా మోనార్కా?’ అని సామాజిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.
సమాచారం ఇవ్వరు.. సమాధానం చెప్పరు.. హైకోర్టు ఆదేశాలను లెక్క చేయరు.. స.హ చట్టం దరఖాస్తులను ఖాతరు చేయరు.. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్తరు.. అసలు ఎన్ని కూల్చివేతలు జరిగినయి? వాటికైన ఖర్చెంత? ఇప్పటివరకు హైడ్రాకు విడుదలైన నిధుల్లో ఎంతమేరకు ఖర్చు పెట్టారో? చెప్పాలని అడిగితే వివరాలు ఇవ్వకుండా ముఖం చాటేస్తరు..
నిరాకరిస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదేమైనా రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలా? దేశభద్రతకు సంబంధించిన వివరాలా? అంటూ మండిపడుతున్నారు. మొదట్లో సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన దరఖాస్తులను కూడా తీసుకోలేదని, ఆ తర్వాత తీసుకున్న దరఖాస్తులకు కూడా సమాచారం ఇవ్వకుండా చట్టంలోని ఒక సెక్షన్‌ను చూపించి తప్పించుకుంటున్నారని చెప్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతూ హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్న హైడ్రా (HYDRA) .. సమాచార హక్కు చట్టాన్ని (RTI) కూడా అపహాస్యం చేస్తున్నది. తాము ఆర్టీఐ పరిధిలో లేము అన్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిరుడు జూలై 19న హైడ్రాను ప్రారంభించింది. అప్పటినుంచి ఇప్పటివరకు సుమారు 600 చోట్ల కూల్చివేతలు జరిగాయని సమాచారం. అధికారిక లెక్కలు మాత్రం లేవు. జూలైలో తొలి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎన్ని కూల్చివేతలు చేశారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని మాత్రమే చెప్పారు. దీంతో అసలు ఎన్ని కూల్చివేతలు జరిగాయి? వాటికైన ఖర్చెంత? ఇప్పటివరకు హైడ్రాకు విడుదలైన నిధుల్లో ఎంతమేర ఖర్చు పెట్టారు? అని చాలామంది ప్రశ్నలను లేవనెత్తారు.
హైడ్రాకు తెలంగాణ ప్రభుత్వం పురపాలకశాఖ కింద 2024-25లో రూ.200 కోట్లు కేటాయించగా, 2025-26లో రూ.100 కోట్లు కేటాయించింది. నిరుడు డిసెంబర్లో ఇచ్చిన రూ.50 కోట్ల నిధులతో హైడ్రా కార్యాలయం నిర్వహణ, కొత్త వాహనాల కొనుగోలు, ఇప్పటివరకు కూల్చివేతలకు సంబంధించిన బిల్లులకు చెల్లింపుల కోసం ఈ నిధులను ఖర్చు చేయవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో రూ.25 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్‌లో రూ.69 కోట్లు ఇచ్చారు. దానికి అదనంగా రూ.20 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే హైడ్రా వద్దకు సుమారు రూ.175 కోట్లు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు.
వీటిని ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టారనేది హైడ్రా బహిర్గతం చేయడం లేదు. దీంతో పలువురు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఆశించిన సమాధానం రావడం లేదు. వినియోగిస్తున్న ప్రజాధనం వివరాలు ఇవ్వమంటే దాటవేస్తున్నారని, పైగా వ్యక్తిగత అంశాలంటూ సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదేమైనా రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలా? దేశభద్రతకు సంబంధించిన వివరాలా? అంటూ మండిపడుతున్నారు. మొదట్లో సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన దరఖాస్తులను కూడా తీసుకోలేదని, ఆ తర్వాత తీసుకున్న దరఖాస్తులకు కూడా సమాచారం ఇవ్వకుండా చట్టంలోని ఒక సెక్షన్‌ను చూపించి తప్పించుకుంటున్నారని చెప్తున్నారు.
దరఖాస్తులే తీసుకోలేదు
తాను మూడుసార్లు హైడ్రాకు దరఖాస్తు చేయడానికి వెళ్తే తీసుకోలేదని, కనీసం ఇన్వార్డ్లో కూడా తనకు స్పందన దొరకలేదని సామాజిక కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ లుబ్నాసర్వత్ తెలిపారు. తాను రిజిస్టర్ పోస్ట్‌లో దరఖాస్తు పంపినా ఇప్పటివరకు సమాధానం రాలేదని పేర్కొన్నారు. ఇదే విషయంపై తాను ఆర్టీఐలోని సెక్షన్ 18 కింద రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. తన దరఖాస్తును తీసుకోకపోగా, ఇప్పటివరకు స్పందించకపోవడంపై హైడ్రా అదికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. తాను అడిగిన సమాచారానికి కూడా హైడ్రా దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నదని మరో సామాజిక కార్యకర్త పల్నాటి రాజేందర్ తెలిపారు. సమాచారహక్కు చట్టం 8(1)(జే) ప్రకారం తాము సమాచారం ఇవ్వలేమంటూ సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజాకార్యకాలాపాలు, ప్రజాప్రయోజనాలతో నిమిత్తం లేని వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే అవాంఛనీయ అవకాశం కల్పించే సమాచారం, విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ సమాచారం వెల్లడి ఉచితమేనని కేంద్ర పౌరసమాచార అధికారి లేక రాష్ట్ర పౌరసమాచార అధికారి లేక అప్పిలేట్ అధికారి భావిస్తే ఈ సమాచారాలను కూడా వెల్లడి చేయవచ్చని పేర్కొన్నారు. పార్లమెంట్‌కు లేక రాష్ట్ర శాసనసభకు అందించదగిన ఎలాంటి సమాచారాన్నయినా ఏ వ్యక్తికైనా అందించవచ్చని, ఇందులో దాపరికం ఏమున్నదని ప్రశ్నించారు. కూల్చివేతల సమాచారం వ్యక్తిగతమా? ఇది ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా చేపట్టిన చర్యలే కదా? మరి సమాచారం ఇవ్వడానికి అభ్యంతరాలు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.
దాపరికంలో ఆంతర్యమేమిటి?
సమాచారం ఇవ్వకుండా హైడ్రా దాచిపెట్టడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజాధనంతో ఆ సంస్థ నడుస్తుంటే వినియోగంపై అడిగే ప్రశ్నలకు సమాచారం ఎప్పటికప్పుడు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంటుందని సామాజిక కార్యకర్తలు తెలిపారు. కానీ సమాచారం గోప్యంగా ఉంచుతుండటంతో ప్రభుత్వం, హైడ్రా కలిసి ఏ మేరకు కుంభకోణాలకు పాల్పడుతున్నారో అనే చర్చ మొదలైంది.
చేసినవి చెప్పడానికి అభ్యంతరమెందుకు?
ప్రభుత్వాలు చేసే పనులు రహస్యంగా ఉండొద్దని, ప్రజలకు తెలియాలనే సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వాలు చేసే ప్రతీ పని, ప్రతీ పథకాన్ని ప్రశ్నించేహక్కు ప్రజలకు ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా పనితీరుపై ప్రశ్నించాం. హైడ్రా కూల్చిన ఇండ్ల వివరాలు, ఖర్చుల వివరాలు అడిగాం. ప్రభుత్వం నియమించిన యంత్రాంగం కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ హైడ్రా కార్యాలయంలో పీఆర్వో మాత్రం ఆర్టీఐ చట్టం 2005లోని విభాగం 8.1 జే ప్రకారం సమాధానం వెల్లడించడం సాధ్యం కాదని అంటున్నారు. దీనిపై అప్పీలు చేస్తాం. అవసరమైతే సమాచారం కోసం కోర్టులకెళ్తాం.
– రాజేంద్ర పల్నాటి, ఫౌండర్,యూత్ ఫర్ యాంటీ కరప్షన్
రాష్ట్ర కమిషనర్ స్పందించడం లేదు
మా పార్టీ తీసుకొచ్చిన చట్టాన్ని మా ప్రభుత్వంలోనే అమలు పరచకుండా హైడ్రా చేస్తు న్న వ్యవహారం బాగాలేదు. దీనిపై చాలా సీరియస్‌గా స్పందిస్తాం. ఈ విషయంపై రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశాం. అసలు సమాచారం దాచిపెట్టాల్సినంత అవసరం హైడ్రాకు ఏమొచ్చింది? కూల్చివేతల వివరాలు, ఎన్ని నిధులను ఖర్చు చేసింది, చెరువుల అభివృద్ధి డీపీఆర్‌లను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టరు? రూ.వంద కోట్లు వాడుకున్న హైడ్రా తనకంటూ ఒక సొంత వెబ్‌సైట్‌ను ఎందుకు నిర్వహించలేకపోతున్నది.
– లుబ్నా సర్వత్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, కాంగ్రెస్ నేత
