హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికకు సంబంధించిన వ్యవహారంలో నాంపల్లి కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నమోదైన పోలీసు కేసును కొట్టేయాలని కోరుతూ 2018లో ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.
శ్రీనివాస్‌గౌడ్ తన నామినేషన్, అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత అఫిడవిట్‌ను మార్చారని, అందుకు ఎన్నికల అధికారులు అనుమతిచ్చారని ఫిర్యాదు రావడంతో శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు నాటి ఎన్నికల అధికారులపై కేసు నమోదు చేయాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మహబూబ్‌నగర్ పోలీసులను ఆదేశించింది. దీంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులపై మహబూబ్‌నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తాజాగా ఆ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని నాటి కలెక్టర్లుగా ఉన్న ఎన్నికల అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని జస్టిస్ కే లక్ష్మణ్‌ను కోరగా, తాను విచారించబోనని, రోస్టర్ ప్రకారం సంబంధిత న్యాయమూర్తి విచారణ చేస్తారని చెప్పారు. ఎవరు విచారణ చేయాలో సీజే నిర్ణయిస్తారని పేర్కొంటూ.. పిటిషన్‌ను సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేశారు.