హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది. ఆదివారం కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ(పీఆర్ఆర్డీ)యంత్రాంగం ఎన్నికల పనుల్లో నిమగ్నమైంది. ఎన్నికల నిర్వహణకు రూ.350కోట్లు ఖర్చు అవుతాయని, ఆ మొత్తాన్ని ఇవ్వాలని పీఆర్ఆర్డీశాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు రూ.350కోట్లను ఫైనాన్స్‌శాఖ విడుదల చేసినట్టు తెలిసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇటీవల రెండ్రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఆ నిధులనే ఖర్చు చేసినట్టు సమాచారం. మరోవైపు జిల్లా పరిషత్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అందజేసినట్టు తెలిసింది. రిజర్వేషన్లను పరిశీలించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగానే సోమవారం ఉదయం 11 గంటలకు కమిషనర్ మీడియా సమావేశం నిర్వహిస్తారని, కీలక అప్డేట్ ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్థానిక ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. తొలుత ఎంపీటీసీ, ఆ తర్వాత జడ్పీటీసీ, చివరకు సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎస్ఈసీ ఇప్పటికే పూర్తిచేసింది. రాష్ట్రంలో 74,903 బ్యాలెట్ బాక్సులు ఉండగా, గుజరాత్ నుంచి 37,530, మహారాష్ట్ర నుంచి 19,450 తెప్పించారు. అయితే బీసీ రిజర్వేషన్‌పై హైకోర్టులో కేసు ఉండగా, నోటిఫికేషన్ తర్వాతా మరికొందరు కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉన్నందున ఎన్నికలు జరుగుతాయా అనే ఉత్కంఠ నెలకొన్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగనున్న ఉపఎన్నిక పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదివారం కేంద్ర పరిశీలకులను నియమించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఎనిమిది రాష్ట్రాల్లో ఉపఎన్నికల కోసం మొత్తం 470 మంది సీనియర్ అధికారులను నియమించినట్టు కమిషన్ ప్రకటించింది. ఈ పరిశీలకుల్లో 320 మంది ఐఏఎస్, 60 మంది ఐపీఎస్, 90 మంది ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్, ఐసీఏఎస్ తదితర సేవలకు చెందినవారని కమిషన్ వివరించింది. వీరు ఎన్నికల ప్రక్రియలో న్యాయం, పారదర్శకత, విశ్వసనీయతను నిర్ధారించడమే లక్ష్యంగా పర్యవేక్షిస్తారని పేర్కొన్నది.