జయశంకర్ భూపాలపల్లి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish rao) రాకతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ధాన్యం కొనుగోలు(Grain purchases) చేయకుంటే రానున్న అసెంబ్లీ సమావేశాలను స్తంభింప జేస్తామని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కమలపూర్ (Kamalapur) ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం లిఫ్ట్ పనులు మొదలు పెట్టారు. మూడు లారీల్లో వడ్లు తరలించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గురువారం కమలాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ రావు సందర్శించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
15 రోజులుగా సుమారు 20లారీలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ఉందని, పొద్దంతా ఎండబోస్తున్నామని, రాత్రి వచ్చే వానకు తడుస్తుందని, తేమ శాతం 16, 17 ఉండాలని అధికారులు చెబుతున్నారని, రోజూ వర్షాలు పడి తడుస్తుంటే తేమ శాతం ఎలా ఉంటుందని హరీశ్‌రావుతో రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. నాయకులు, అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, వర్షాలకు పక్కనే ఉన్న చెరువులోకి కొట్టుకుపోయేలా ఉన్నాయని, కనీసం కటింగ్‌తో తీసుకోమని కోరినా వినేవారు లేరని అన్నారు.
వెంటనే హరీశ్‌రావు జాయింట్ కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ‘ప్రతి గింజా కొంటాం.. అని ప్రకటనలు ఇస్తున్నారు.. తడిసిన ధాన్యం కొంటామని అంటున్నారు.. కమలాపూర్‌లో పరిస్థితి ఏంటి.. 20 రోజులుగా వర్షాలకు ధాన్యం తడుస్తున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదు’ అని ప్రశ్నించారు. మూడు రోజుల్లో ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలని సూచించారు. అలాగే రైతుల సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పుతామని పేర్కొన్నారు. మొత్తంగా హరీశ్ రావు రాకతో అధికారులు ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంతో రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.