చాంద్రాయణగుట్ట/హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి భార్యకు చెందిన రెండు బ్యాంకు లాకర్లలో కట్టలకొద్దీ డబ్బులు.. కిలోల కొద్దీ బంగారం, వజ్రాభరణాలు బయటపడ్డాయి. అధికారులు శనివారం హైదరాబాద్ షాలిబండ ప్రాంతంలోని కెనరా బ్యాంక్ శాఖలో రెండు లాకర్లను ఓపెన్ చేశారు. ఆ లాకర్లలో రూ.1.50 కోట్ల నగదు లభ్యమైంది. ఒకోటి 100 గ్రాముల బరువున్న 12 బంగారు బిసెట్లు లభ్యమయ్యాయి. మొత్తం బరువు 1.2 కిలోగ్రాములు. బంగారం, వజ్రాభరణాలు కలిపి 2 కిలోల బరువున్న ఆభరణాలు లాకర్లలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ నెల 16న ఏసీబీ అధికారులు పాతబస్తీ ఛత్రినాకలోని నరహరిరావు ఇంటితోపాటు నగరంలో ఆయన బంధువులు, స్నేహితులకు సంబంధించిన 10 ఇండ్లపై ఏకకాలంలో దాడులు చేసి భారీగా నగదుతో పాటు బంగారం, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్ల్లు ఉంటుందని అంచనావేశారు. అప్పుడు నరహరి భార్య పేరిట ఉన్న రెండు లాకర్లకు సంబంధించిన వివరాలను ఆ కుటుంబం వెల్లడించలేదు. దీంతో ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న నరహరి అత్తమామలతోపాటు ఆయన కుమారుడి పేరున అస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. నరహరిరావు అవినీతిపై లోతుగా విచారణ జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ తెలిపారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నరహరిరావును లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి కోరనున్నామని చెప్పారు.