కరీంనగర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ లోని(Karimnagar) లోయర్ మానేర్ డ్యామ్(Maneru Dam) జలకళ సంతరించుకున్నది. వర్షాల కారణంగా ప్రాజెక్టుకు విపరీతమైన ఇన్ఫ్లోలు వస్తున్నందున ఎల్ఎమ్డీ నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 23 టీఎంసీలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఇంజినీరింగ్ అధికారులు రెండు గేట్లు ఎత్తి(,Lift gates) మూడు వేల క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి వదిలారు. మిడ్ మానేరు నుంచి వచ్చే ఇన్ ఫ్లో స్థాయిని బట్టి గేట్లు మూసివేసే అవకాశం ఉంది.
సాయంత్రం లేదా రాత్రి క్లోజ్ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, లోయర్ మానేరులో నీటిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానేరు నది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలలో నివసించే ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు, గొర్రెల కాపరులు, రైతులు నది దగ్గరకు వెళ్లవద్దని సూచించారు.