హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావారణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీచేశారు. అదే సమయంలో పలు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నదని తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఎకువగా ఉండటంతోపాటు వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నారు.
ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలతోపాటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శుక్రవారం వరకు అకడకడ ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.
దాదాపు రెండు వారాల తర్వాత తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత రెండు వారాలుగా 44 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పడిపోయాయి. హైదరాబాద్లో 40 డిగ్రీల కంటే తకువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం చల్లని గాలులు వీయటంతో నగరవాసులు ఉపశమనం పొందుతున్నారు. రాబోయే మూడు, నాలుగు రోజులు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.