న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియాతో జరగాల్సిన మ్యాచ్(India Vs Pakistan)ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు స్పందించారు. పాకిస్థాన్ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, మొహమ్మద్ యూసుఫ్‌లు పశ్చాతాపాన్ని వ్యక్తం చేశారు. కానీ తమ దేశం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండనున్నట్లు చెప్పారు. భారత మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ భిన్నంగా స్పందించారు. పాకిస్థాన్ నిర్ణయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. ఎందుకంటే మెగా టోర్నీల్లో పాక్ ఇలాగే యూ టర్న్ తీసుకుంటుందన్నారు.
రాజకీయాల వల్ల మూతపడ్డ దారులు.. క్రికెట్‌తో తెరుచుకుంటాయని విశ్వసిస్తాని షాహిద్ అఫ్రిదీ అన్నారు. వరల్డ్‌కప్‌లో ఇండియాతో పాక్ ఆడడం లేదని, కానీ ప్రభుత్వ నిర్ణయానికి బాసటగా ఉన్నామని, ఇలాంటి సందర్భాల్లో ఐసీసీ నిష్పక్షపాత నిర్ణయాన్ని తీసుకోవాలన్నారు. ప్రతి సభ్యుడికి న్యాయం జరగాలన్నారు. యూసుఫ్ స్పందిస్తూ ఇది చాలా కఠినమైన నిర్ణయం అని, గవర్నమెంట్‌కు కట్టుబడి ఉన్నామని, కమర్షియల్ ప్రయోజనాల కన్నా ముందు విలువలు ముఖ్యమని, క్రికెట్లో ఉన్న పక్షపాతం ముగిసిపోవాలని యూసుఫ్ పేర్కొన్నారు.
రానున్న నాలుగైదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రియాక్షన్లు వస్తాయని, మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తారని, పాకిస్థాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటదని భావిస్తున్నానని సునీల్ గవాస్కర్ అన్నారు. దీంట్లో కొత్త ఏం ఉందని, పాక్ క్రికెటర్ల గురించి తెలుసు అని, ముందు రిటైర్మెంట్ ప్రకటిస్తారని, మళ్లీ నాలుగు రోజుల తర్వాత అభిమానులు ఆడమన్నారని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారన్నారు. ఐసీసీ న్యాయం చేసేంత వరకు వేచి ఉండాలని, బహుశా ఆంక్షలు, జరిమానాలు పడే అవకాశం ఉందని, మళ్లీ ఐసీసీ టోర్నీ నిర్వహించే అవకాశం ఆ దేశానికి దక్కదని హర్భజన్ సింగ్ అన్నారు.
పాకిస్థాన్ తమ స్వంత క్రికెట్‌ను నాశనం చేసుకుంటోందని మదన్ లాల్ అన్నారు. ఇది వాళ్ల సమస్యలను పరిష్కరించలేదన్నారు. సరైన రీతిలో ఆలోచన చేయాలని, ప్రస్తుతం వారి ఆలోచనలు సరిగా లేవన్నారు.