VijayaDiagnostic | తప్పుడు రిపోర్టులు ఇచ్చిన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌పై భారీ జరిమాన విధించింది వినియోగదారుల హక్కుల కమిషన్. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందిన భార్గవి అనే గర్భిణి, తన గైనకాలజిస్ట్ సూచన మేరకు ఎన్టీ (NT Scan) స్కాన్ కోసం స్థానిక విజయ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ఆశ్రయించింది. అయితే పరీక్ష అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితి అంతా సాధారణంగానే ఉందని సదరు సెంటర్ సిబ్బంది రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టుపై అనుమానం వచ్చిన భార్గవి మరో డయాగ్నోస్టిక్ సెంటర్లో తిరిగి పరీక్ష చేయించుకోగా షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. కడుపులోని శిశువు మెడపై సుమారు 11 ఎంఎం మేర సిస్ట్ (గడ్డ) ఉన్నట్లు రెండో రిపోర్టులో తేలింది.
దీంతో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇచ్చిన తప్పుడు రిపోర్టును నమ్మి ఉంటే తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు, వైద్యుల సలహా మేరకు తన గర్భాన్ని తొలగించుకోవాల్సి వచ్చింది తెలిపింది. అలాగే తనకు తప్పుడు రిపోర్టులు ఇచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన కమిషన్, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వైఖరిలో స్పష్టమైన నిర్లక్ష్యం ఉందని నిర్ధారించింది. దీంతో బాధితురాలికి కలిగిన మానసిక వేదనకు గానూ రూ. 2 లక్షల పరిహారం, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 20 వేలు, పరీక్ష ఫీజు రూ. 1,700 తక్షణమే చెల్లించాలని సదరు యాజమాన్యాన్ని ఆదేశిస్తూ కీలక తీర్పునిచ్చింది.