Shruti Hassan | సినిమాల్లో తన అందం, నటనతో ప్రేక్షకులను అలరించే హీరోయిన్ శృతి హాసన్… నిజ జీవితంలోనూ తన మనసు ఎంత గొప్పదో నిరూపించింది. అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చి, ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. ఇటీవల ఆ చిన్నారి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ కావడంతో శృతి చేసిన సహాయం వెలుగులోకి వచ్చింది. ‘ఆళ్వి’ అనే పసిపాప ఎంఎస్ఎమ్డీ (MSMD – Mendelian Susceptibility to Mycobacterial Diseases) అనే అరుదైన జన్యు వ్యాధితో జన్మించింది. 2023లో పుట్టిన ఈ చిన్నారి… కొద్ది నెలలకే ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2025 నాటికి పరిస్థితి విషమించడంతో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ తప్పనిసరి అయింది.
ఇలాంటి క్లిష్ట సమయంలో శృతి హాసన్ ఆ కుటుంబానికి అండగా నిలిచి… వైద్య సాయం నుంచి మానసిక ధైర్యం వరకు అన్ని విధాలుగా తోడ్పాటునిచ్చింది. చిన్నారి తల్లిదండ్రులు తమ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో భావోద్వేగంగా రాస్తూ .. మా పాప ఈరోజు బతికి ఉందంటే దానికి కారణం శృతి గారే. ఆమె ఒక స్టార్ మాత్రమే కాదు… గొప్ప మనసున్న మనిషి” అని కృతజ్ఞతలు తెలిపారు. పాప ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న సమయంలో శృతి హాసన్ స్వయంగా రంగంలోకి దిగింది. నిపుణులైన వైద్యులు డాక్టర్ ధరణి, డాక్టర్ దివ్య వంటి స్పెషలిస్టులతో ఆ కుటుంబాన్ని కనెక్ట్ చేసింది.
దేశంలోని ఉత్తమ వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేసింది. కేవలం వైద్య సహాయం మాత్రమే కాకుండా… ఆర్థికంగా, మానసికంగా కూడా కుటుంబానికి బలంగా నిలిచింది. ఈ సహాయం వల్లే ఆళ్వి చికిత్స విజయవంతమై ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల ఆళ్వి తన తల్లిదండ్రులతో కలిసి శృతి హాసన్‌ను కలిసింది. ఆ సందర్భంగా శృతి చిన్నారితో ఆడుకుంటూ, ఆమెకు పెద్ద బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె మమ్మల్ని కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. ఆళ్వి కోసం తీసుకొచ్చిన చిన్న బహుమతి మా పాప ముఖంలో వెలుగుని తీసుకొచ్చంది. అది ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఆమె చాలా డౌన్ టు ఎర్త్” అని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు శృతి హాసన్ హార్ట్ ఎమోజీలతో స్పందించడం అభిమానులను మరింత ఆకట్టుకుంది.