వ్యక్తి/సంస్థ/కంపెనీ ఎవరైనా పట్టా భూమిలోగాని, ప్రభుత్వ, అసైన్డ్, లీజు భూముల్లోగాని కొత్త ప్రాజెక్టును ప్రారంభించే ముందు చెట్లను తొలగించాలనుకుంటే కచ్చితంగా ఆన్లైన్లో యాజమాన్య ధ్రువీకరణతో పాటు ఫారం 13-ఏ ద్వారా పూర్తి వివరాలను సమర్పించి అనుమతి తీసుకోవాలి. ఇన్స్పెక్షన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, పరిహారం కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి. వివిధ హోదాల్లోని అటవీ శాఖ అధికారులు సైతం ఆన్లైన్లో తదుపరి దశల్లో పురోగతిని నమోదు చేయాలి.
టీజీఐఐసీ జోనల్ మేనేజర్ గత నెల 17న శేరిలింగంపల్లి తహసీల్దార్ ఇచ్చిన యాజమాన్య ధ్రువీకరణతో చెట్ల తొలగింపునకు గాను శంషాబాద్ ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్‌డీవో)కి ఫారం 13-ఏను జత చేసి లేఖ రాశారు. దాని ఆధారంగా తదుపరి ప్రక్రియలు నిర్వహించి అనుమతులు తీసుకున్నాం.
– హెచ్‌సీయూలో చెట్ల నరికివేతకు ముందు తీసుకున్న అనుమతి ప్రక్రియపై టీజీఐఐసీ-అటవీ శాఖ అధికారులు కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి ఇచ్చిన వివరాల సారాంశమిది. సీఈసీ నివేదికలోని 21వ పేరాగ్రాఫ్‌లో ఉన్న వివరాలివే.
HCU Lands | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉత్తర్వుల్లో అనుమతుల ప్రక్రియ అంతా కచ్చితంగా ఆన్లైన్లోనే ఉండాలని ప్రభుత్వమే స్పష్టంచేసింది. కానీ టీజీఐఐసీ, అటవీ శాఖ అధికారులు చెప్తున్న ప్రకారం వ్యవహారమంతా ఆఫ్‌లైన్ (మాన్యువల్‌గా)లో జరిగింది. అంటే జీవోను ఉల్లంఘించిమరీ చేపట్టినట్టు స్పష్టమవుతున్నది. పైకి చూసేందుకు కేవలం ఉల్లంఘనలానే కనిపిస్తున్నది. లోతుకు వెళ్తే అసలు చెట్ల నరికివేతకు ముందు ‘అనుమతులు’ అనే అంశాన్నే పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనల పరంపరలో కాంగ్రెస్ ప్రభుత్వం దుందుడుకుగా వ్యవహరించి.. రాత్రికి రాత్రి బుల్డోజర్లతో విరుచుకుపడింది.
మూడు రోజుల పాటు రేయింబవళ్లు పర్యావరణ విధ్వంసానికి పాల్పడింది. తీరా యావత్తు దేశంతో పాటు సుప్రీంకోర్టు సైతం ఉలిక్కిపడి ఇటువైపు చూడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగడంతో ‘వాల్టా చట్టం కింద అనుమతులు’ మాటున తప్పించుకునే ప్రయత్నాలు జరిగాయనే విమర్శలున్నాయి. అందులో భాగంగానే జీవో 23 అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వ, ప్రైవేటు కోణంలో కచ్చితంగా ఆన్లైన్లోనే సాగిన అటవీ శాఖ అనుమతుల ప్రక్రియ ఇప్పుడు మాత్రం ఆఫ్‌లైన్ చేశామనడమే అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది. దీంతో అధికార యంత్రాంగం చివరికి కేంద్ర సాధికార కమిటీని సైతం తప్పుదోవ పట్టించిందా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కేంద్ర సాధికార కమిటీ సైతం తన నివేదికలో ‘ఇవన్నీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలుగా ఉన్నాయి’ అని పేర్కొనడం గమనార్హం.
రాష్ట్రంలో వాల్టా-2002 సవరణతో 2017లో కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 23 తర్వాత వ్యక్తులు, సంస్థలు చివరకు ప్రభుత్వపరంగా నిర్మించే సాగునీటి, ఇతర ప్రాజెక్టుల కోసం చెట్ల తొలగింపు చేపడితే అనుమతులు, ఫీజు చెల్లింపుల ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే సాగుతున్నది. ఈ మేరకు గతంలో అనేకసార్లు ఆఫ్‌లైన్‌కు కొందరు అధికారులు ప్రయత్నం చేసినా అటవీ శాఖ ఉన్నతాధికారులు తమ సమీక్షల్లో కేవలం ఆన్లైన్లోనే చేయాలని, మాన్యువల్‌ను అంగీకరించొద్దనే ఆదేశాలూ జారీ చేసిన సందర్భాలున్నాయి. కానీ మొదటిసారిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో చెట్ల నరికివేతకు సంబంధించి మాత్రం ఆఫ్‌లైన్‌లో అనుమతుల ప్రక్రియ జరిగినట్టుగా అటవీ శాఖ అధికారులు చెప్తుండటం తీవ్ర అనుమానాలకు తావిస్తున్నది. కేంద్ర సాధికార కమిటీకి ఇచ్చిన నివేదికలో అటవీ శాఖనే దీన్ని వివరించింది. గత నెల 17న టీజీఐఐసీ జోనల్ మేనేజర్ 13-ఏ ఫారంతో పాటు మినహాయింపు ఉన్న చెట్ల మదింపునకు శంషాబాద్ ఎఫ్డీవోకు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు.
గత నెల 20న డీఎఫ్‌వో ఆ లేఖను స్వీకరించారు. గత నెల 29న టీజీఐఐసీ ఇన్స్పెక్షన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, పరిహార ఫీజులను చెల్లించిందని తెలిపారు. మరుసటి రోజు అంటే గత నెల 30న చెట్ల నరికివేత చేపట్టారనేది అటవీ శాఖ అధికారుల వివరణ. ఆ తర్వాత ఈ నెల 3న (వివాదం జాతీయస్థాయిలో సంచలనమైన తర్వాత) శంషాబాద్ ఎఫ్ఆర్వో పరిశీలించగా మొత్తం 1524 చెట్లను నరికివేస్తే అందులో 125 మినహాయింపులేని చెట్లున్నాయని, మూడు జేసీబీలను సీజ్ చేశామని అటవీ శాఖ నివేదికలో చెప్పారు. వాస్తవానికి అధికారులు అనుమతి ఇచ్చే ముందు చెట్ల లెక్కింపు, వాటి ఎత్తు, సమగ్ర వివరాలతో పాటు నరికివేసిన తర్వాత కాండం చుట్టుకొలత వంటి వివరాలు నమోదు చేయాలి. కానీ బుల్డోజర్లతో చెట్ల మొదళ్లను సైతం పెకిలించినవే ఎక్కువ ఉన్నందున అధికారులు వాటిని అసలు అంచనా వేసే పరిస్థితి కూడా లేదని తెలిసింది. అందుకే కేంద్ర సాధికార కమిటీ ఈ అనుమతుల ప్రక్రియ, అటవీ శాఖ నివేదికపై అనుమానాలు వ్యక్తం చేయడంతోపాటు తీవ్ర ఆక్షేపణలు కూడా చేసింది.
‘వీటన్నింటినీ పరిశీలిస్తే కేవలం పారదర్శకత లోపించినట్టుగానే అనిపించడం లేదు. విచారణ అధికారులను తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నాలుగా ఉన్నాయి. చట్టపరమైన పరిశీలన నుంచి తప్పించుకునేందుకు ఈ ప్రయత్నాలు చేసినట్టుగా అనిపిస్తున్నది’ అని సీఈసీ ఆక్షేపించడం అనుమతులన్నీ చెట్ల నరికివేత తర్వాత చేసిన గూడుపుఠాణి అనేందుకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.