నిజాంసాగర్, జనవరి 29: నిజాంసాగర్ ఆయకట్టు కింద ఎండిపోతున్న నారుమళ్లకు సాగునీటిని అందించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ‘నమస్తే తెలంగాణ’ కథనంతో స్పందించిన నీటిపారుదలశాఖ అధికారులు నారుమళ్లకు నీళ్లందించారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని జీరో డిస్ట్రిబ్యూటరీ కింద 250 ఎకరాల్లో రైతులు వరినార్లు పోసుకున్నారు.
ప్రధాన కాలువ డ్రాప్గేట్లు మొరాయిస్తుండడంతో నీరందడం లేదు. నారు ఎండిపోతుండడంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నారుమళ్లను కాపాడుకుంటున్న వైనాన్ని ఈ నెల 27న ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురించింది. సోమవారం స్పందించిన అధికారులు కుప్పి ఏర్పాటు చేసి డ్రాప్గేట్లను పైకి లేపి నీటిని ఆయకట్టుకు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. అధికారులను కదిలించేలా కథనం ప్రచురించిన ‘నమస్తే తెలంగాణ’కు రైతులు ధన్యవాదాలు తెలిపారు.