Telangana | హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ చర్యలతో అధికారులు అభద్రతా భావంలో మునిగిపోయారు. ఏ ఫైల్ పై సంతకం పెట్టాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం విచ్చలవిడిగా బదిలీలు చేస్తుండటంతో ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు కలవరపడుతున్నారు. ఎప్పుడు ఏ పోస్ట్‌లో ఉంటామో, ఎప్పుడు బదిలీ అవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. వరుస బదిలీల కారణంగా నిర్ణయాలు స్థిరంగా తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకున్నా వాటిని అమలు చేసే వరకు ఉంటామో లేదోననే అనుమానం వారిని వెంటాడుతున్నది. మరోవైపు మంత్రులతోపాటు కీలక నేతలుగా చెప్పుకునే వారి సంఖ్య ఎకువగా ఉండటంతో పైరవీలు ఎకువైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకో మంత్రి నుంచి లెకకు మించి సిఫారసు లేఖలు వస్తున్నాయని చెప్తున్నారు. దీంతోపాటు తమ పనులు చేయాలంటూ కాంగ్రెస్ నేతల ఒత్తిడి పెరిగిపోతున్నదని కిందిస్థాయి అధికారులు వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 11 నెలల్లో అనేకసార్లు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను బదిలీ చేసింది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 11 నెలల్లోనే మూడు నాలుగు స్థానాలు మారాల్సి వచ్చింది. వారు కొత్తచోట కుదురుకునే లోగానే మళ్లీ బదిలీ చేస్తుండటంతో తలలు పట్టుకుంటున్నారు. ఆ శాఖపై లేదా ఆ జిల్లాపై అవగాహన పెంచుకునేలోగా కొత్త ప్రాంతానికి వెళ్లాల్సి వస్తున్నదని, ఇది మానసికంగా ఎంతో ఒత్తిడికి గురి చేస్తున్నదని ఐఏఎస్ అధికారులు వాపోతున్నారు. రంగారెడ్డి జిల్లాకు 11 నెలల్లో ముగ్గురు కలెక్టర్లు మారారు. అంటే మూడున్నర నెలలకు ఒకరిని చొప్పున మార్చినట్టు చెప్తున్నారు. టీకే శ్రీదేవిని కూడా వాణిజ్య పన్నుల శాఖ నుంచి ఆగస్టులో ఎస్సీ డెవలప్మెంట్కు, తాజాగా అకడి నుంచి మున్సిపల్ విభాగానికి బదిలీ చేశారని గుర్తు చేస్తున్నారు. మున్సిపల్ శాఖలో కీలకమైన సీడీఎంఏ పోస్టుకు ఇప్పటివరకు ఐదుగురు అధికారులు మారారు. ఐపీఎస్ అధికారులది కూడా ఇదే పరిస్థితి. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను అంతకుముందు నాలుగుసార్లు బదిలీ చేశారు. ఎస్ఏఏం రిజ్వీ మూడుసార్లు బదిలీ అయ్యా రు. ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఏ పదవిలో ఎప్పుడు, ఎకడ ఉంటా మో తెలియదు కాబట్టి అనవసర తలనొప్పులు ఎందుకు అంటూ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
కొందరు మంత్రులు, కీలక నేతలు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి పనులు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పలువురు ఐఏఎస్‌లు వాపోతున్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం మారుతుందని, ముఖ్యమంత్రి మారుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మౌఖికాదేశాలతో చేసే పనులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఒకవేళ వాటితో ఏదైనా సమస్య ఏర్పడితే తమ మెడకు చుట్టుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా తమ కెరీర్‌కు మచ్చ ఎందుకు తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు.
కిందిస్థాయి అధికారులపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఎకువగా ఉన్నదని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బిల్లులు, పనులు, కాంట్రాక్టులు.. ఇలా అనేక అంశాల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్తున్నారు. చిన్న నేతలు కూడా మంత్రులు, బడానేతల పేర్లు చెప్తున్నారని, వారు చెప్పిన మాట వినకుంటే బదిలీ చేయిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు చెప్పుకుందామన్నా, వారి పరిస్థితి కూడా ఇలాగే ఉన్నదని వాపోతున్నారు. ఇలా అధికారుల్లో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ భయపడే పరిస్థితులు దాపురించాయి.