హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం విషయంలో నిబంధనలు బేఖాతరు చేసిన వైస్ చాన్స్లర్(వీసీ)పై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ‘ప్రజావాణి’ అధికారులు విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిని ఆదేశించారు. ఆ పోస్టు నియామకంలో తమకు అన్యాయం జరిగిందంటూ మంగళవారం బాధితురాలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
నోటిఫికేషన్లో ప్రకటించిన విధంగా అన్ని అర్హతలు కలిగిన ఒక గిరిజన మహిళా అభ్యర్థికి కాకుండా.. కనీస అర్హతలు లేని ఒక పురుష అభ్యర్థికి ఆ పోస్టు కట్టబెట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పోస్టు భర్తీ క్రమంలో ఆ వర్సిటీ వీసీ అవలంభించిన వివక్ష వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని కోరుతూ విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి ఆదేశాలు పంపిస్తామని ప్రజావాణి అధికారులు హామీ ఇచ్చినట్టు బాధితురాలు పేర్కొన్నారు.