బోధన్ రూరల్, ఫిబ్రవరి 28: నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు చివరి ఆయకట్టుకు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కడుపు మండిన రైతులు శుక్రవారం నీటిపారుదల శాఖ అధికారులను నిర్బంధించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా సాలూర మండలం సాలూర క్యాంప్ గ్రామంలో చోటుచేసుకున్నది. నిజాంసాగర్ కెనాల్ డి-28 పరిధిలోని చివరి ఆయకట్టుకు నీటిని అందించి పంటలు కాపాడాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహానికిలోనైన రైతులు.. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులను నిర్బంధించారు. పంటలు ఎండిపోతున్నా స్పందించడం లేదని, అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ పంటలు ఎండబెట్టుకోవాలా? అని మండిపడ్డారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసి ఏడు రోజులైనా చివరి ఆయకట్టుకు నీళ్లు అందడం లేదని, అధికారులు పట్టించుకోకపోతే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు చేరుకుని రైతులను సముదాయించా రు. ఆ తరువాత అధికారులు రైతులతో కలిసి డి-28 మెయిన్ కెనాల్‌ను పరిశీలించారు.