SLBC tunnel | హైదరాబాద్, మార్చి30 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ నిర్మాణ మార్గంలో మరో 4 షీర్ జోన్లు ఉన్నట్టుగా అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆ నాలుగు షీర్ జోన్లు అత్యంత ప్రమాదరకరంగా ఉన్నట్టు తేల్చి చెప్తున్నారు. ఇవి పనులకు అత్యంత ఇబ్బందికరంగా మారుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో మిగతా సొరంగమార్గం నిర్మాణంపై సందిగ్ధం నెలకొన్నది. సొరంగం తవ్వాల్సిన మార్గంలో మొత్తంగా 11 షీర్ జోన్లు ఉండగా, ఇప్పటికే 6 జోన్లను దాటి పనులు చేపట్టారు. ప్రస్తుతం ప్రమాదం సంభవించిన జోన్ మినహాయిస్తే మరో 4 జోన్లు ఉన్నాయన్నమాట.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 43.93 కిలోమీటర్లు సొరంగమార్గం ద్వారా కృష్ణా జలాలను దిండి నది వద్ద నిర్మించే రిజర్వాయర్‌లో (నక్కలగండి తండా) కలుపుతారు. ఈ సొరంగం తవ్వకం పనులను వ్యతిరేక దిశలో ఇరువైపుల నుంచి ప్రారంభించారు. శ్రీశైలం రిజర్వాయర్ గట్టు నుంచి అచ్చంపేట మండలం దోమలపెంట నుంచి ఇన్లెట్, మహబూబ్‌నగర్ జిల్లా మన్యంవారిపల్లె నుంచి అవుట్లెట్ టన్నెల్ పనులను ప్రారంభించారు.
అందులో ఇన్లెట్ చివర నుంచి 13.937 కి.మీ, అవుట్లెట్ నుంచి 20.435 కి.మీ. కలిపి ఇప్పటివరకు మొత్తంగా 34.372 కి.మీ. సొరంగమార్గం పనులు పూర్తయ్యాయి. ఇంకా 9.560 కి.మీ. మేర సొరంగం తవ్వాల్సి ఉన్నది. అయితే ప్రస్తుతం ఇన్లెట్ వైపు 13.93 కి.మీ. వద్ద సొరంగం కూలి ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను వెలికి తీయగా, ఇంకా ఆరుగురు కార్మికుల అచూకీ లభించలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
షీర్ జోన్ అంటే పగులువారి రాతిపొరలు ఉండే ప్రాంతం. ఆ పగుళ్లలో మట్టి, నీరు చేరడంతోపాటు రాతిపొరలు భౌతిక ఒత్తిళ్లకు గురవడం, రాళ్ల భాగాలు ఒకదానికొకటి వ్యత్యాసంగా తేలికగా జారిపోవడం, కదలికలకు గురవడం, పూర్తిగా వదులుగా మారిపోయి ఉంటాయి. ఫలితంగా భూప్రకంపనలకు గురవుతుంటుందని నిపుణులు వివరించారు. సొరంగ నిర్మాణాల వైఫల్యాలకు ప్రధానంగా ఇలాంటి జోన్లే కారణంగా నిలుస్తాయని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అలాంటి జోన్లలో సొరంగ నిర్మాణాలను చేపట్టే సమయంలోనే అనేక రకాలుగా అధ్యయనాలు చేయాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. టన్నెల్లో అలాంటి షీర్ జోన్లోనే ఇటీవల ప్రమాదం సంభవించి, 8 మంది గల్లంతయ్యారు.
2005లో ఎస్ఎల్బీసీ అలైన్మెంట్ సమయంలోనే సొరంగ నిర్మాణ మార్గంలో మొత్తంగా 11 షీర్ జోన్లను గుర్తించినట్టు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు ఇన్లెట్, ఔట్లెట్ మొత్తంగా కలిపి 6 షీర్ జోన్లను దాటుకుని సొరంగ నిర్మాణం కొనసాగించిచారు. ప్రస్తుతం ప్రమాదం సంభవించిన ప్రాంతంలో షీర్ జోన్ 8-15 మీటర్ల వరకు విస్తరించి ఉండగా, రాబోయే జోన్లు 20-50 మీటర్ల వరకు విస్తరించి ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కూలిన సొరంగం ప్రాంతంలో శిథిలాలను తొలగించి తవ్వకం పనులను పునరుద్ధరించినా అది కూడా కత్తిమీది సాములాంటిదేనని అధికారవర్గాలు వివరిస్తున్నాయి.
షీర్ జోన్ అనేది భూప్రకంపనాలకు అత్యంత ప్రభావితమైన ప్రాంతమని, ఇలాంటి చోట్ల భూభౌతిక అధ్యయనాల ఆధారంగానే నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రధానంగా భూమిలోని రాళ్ల దృఢత్వాన్ని అంచనా వేసేందుకు సెస్మిక్ టోమోగ్రఫీ, భూపొరల్లోని మార్పులను అర్థం చేసుకునేందుకు గ్రావిటీ సర్వే, భూ ఉష్ర్టోగ్రతలతో వాటిల్లే మార్పులను గుర్తించేందుకు మ్యాగ్నెటిక్ సర్వే, భూమిలోపలి నీటి నిక్షేపాలను, ప్రవాహరీతులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు రీసిస్టివిటీ టెస్టింగ్, భూపొరల్లో ఒత్తిడిని గుర్తించేందుకు స్ట్రెయిన్ గేజ్ తదితర పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని చెప్తున్నారు. భౌగోళిక నమూనాకు సంబంధించి కచ్చితత్వం కోసం బోర్‌హోల్స్ ద్వారా సర్వేలు నిర్వహించి రాతి రకం, వాతావరణ తీవ్రత తదితర అంశాలను, పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. మెటీరియల్ సైన్స్, రాక్ మెకానిక్స్, జియాలజికల్ తదితర విభాగాల సమ్మేళంతో అధ్యయనం చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఆయా అధ్యయనాల అనంతరమే నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అనేక ముందస్తు రక్షణ జాగ్రత్తలను పాటిస్తూ పనులను చేపట్టాల్సి ఉంటుందని తేల్చి చెప్తున్నారు.