అలంపూర్ చౌరస్తా, జనవరి 28 : ప్రభుత్వ పథకాలకు తాము అర్హులం కాదా? అని అడిగినందుకు సామాన్యుడిపై ఓ అధికారి బూతుపురాణం అందుకున్నాడు. ఈ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో ప్రభుత్వం ప్రారంభించిన పథకాలకు సంబంధించి లబ్ధిదారుల పేర్ల జాబితా గ్రామపంచాయతీ గోడకు అంటించారు. జాబితాలో తన పేరు లేదని స్థానికుడు రామకృష్ణ ఆందోళన చెందాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటలైనా ఎంపీడీవో రాకపోవడంతో సదరు వ్యక్తి ఫోన్లో మాట్లాడాడు. ‘నేను కులాంతర వివాహం చేసుకున్న.. నాకు సెంటు స్థలం, పొలం లేదు. ఇల్లు కూడా లేదు. అన్ని అర్హతలు ఉన్నా నాకెందుకు పథకాలు మంజూరు కాలేదు’ అని నిలదీశాడు. ఈ విషయంపై అడుగుదామని వస్తే అందుబాటులో లేరనడంతో అధికారి ఆగ్రహంతో యువకుడిపై తిట్టడం మొదలుపెట్టాడు. ఈ మాటలను ఆడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నది. ఈ విషయమై ‘నమస్తే తెలంగాణ’ ఎంపీడీవోను వివరణ కోరగా.. ‘నేను పథకాలపై ప్రజలతో మాట్లాడుతుండగా వేరే వాళ్లు అన్న మాటలు వారికి ఫోన్లో వినిపించడంతో తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అలా మాట్లాడలేదు’ అని చెప్పారు.