హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న తమ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆ శాఖ అధికారుల చుట్టూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా నెలాఖరు కావడంతో ఆర్థిక శాఖ అధికారులకు బిల్లుకు సంబంధించిన టోకెన్ నంబర్లు సహా అర్జీలు దాఖలు చేస్తున్నారు. మూడు నెలల నుంచి తిరుగుతున్నా చిన్న చిన్న మెడికల్ బిల్లులు కూడా చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్ నంబర్లతో దరఖాస్తులు చేసుకుంటున్న వారిలో ఎవరికి క్లియర్ అవుతున్నాయో కూడా అర్థం కావడంలేదంటున్నారు.
బాధితుల్లో ఎక్కువగా ఉపాధ్యాయులే. ఓ వైపు ఎండలు.. మరో వైపు ఎన్నికల కోడ్.. అయినా బిల్లుల కోసం బాధిత వర్గాలు నిత్యం వందల సంఖ్య లో సచివాలయానికి వస్తున్నారు. ఆర్థిక శాఖ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు ఇప్పటికే ట్రెజరీలతో పాటు ఆయా డిపార్టుమెంట్ల నుంచి కూడా క్లియర్ చేయడం లేదని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర శాఖ మంత్రలు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.