Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): అధికారానికి వచ్చిన నాటి నుంచి అప్పులతోనే పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకోవడానికి సిద్ధమవుతున్నది. వచ్చే నెల ఒకటో తేదీన మరో రూ.2,000 కోట్ల అప్పు సమీకరించుకొనేందుకు కసరత్తు ప్రారంభించింది. రూ.1,500 కోట్ల విలువైన బాండ్‌ను 15 ఏండ్లకాలానికి, రూ.500 కోట్ల విలువైన బాండ్‌ను 18 ఏండ్ల కాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ రిజర్వు బ్యాంకుకు జారీచేసింది. ఈ బాండ్‌ను అక్టోబర్ ఒకటిన ఆర్బీఐ వేలం వేయనున్నది. అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనున్నది.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కారు అధికారం చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకు రూ.71,495 కోట్ల అప్పు చేసింది. వచ్చే రూ.2,000 కోట్లతో కలిసి రాష్ట్ర రుణం రూ.73,495 కోట్లకు చేరుతుంది. ఈ నెల 3న రూ.2,500 కోట్లు, 10న 1,500 కోట్లు, 17న రూ.500 కోట్లు.. ఇలా నెల వ్యవధిలోనే రూ.4,500 కోట్ల రుణం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అక్టోబర్ 1న మరో రూ.2,000 కోట్ల అప్పు తీసుకోనున్నది. ప్రతి నెలా రూ.5 వేల కోట్ల నుంచి 6 వేల కోట్ల విలువైన బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటున్నది.