ఊట్కూర్, ఫిబ్రవరి 4 : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బాపురం శివారులో ఎత్తిపోతల పథకంలో భాగంగా పంప్‌హౌస్ నిర్మాణం కోసం చేపట్టిన సాయిల్ టెస్టు పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. నారాయణపేట-కొడంగల్-మక్తల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగు నీటితోపాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు కానున్న ఎత్తిపోతల పనులను కొద్దిరోజుల కిందట సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. మక్తల్ మండలం భూత్పూర్ జలాశయం నుంచి కాన్కుర్తి వరకు మూడు చోట్ల నీటిని లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో భూత్పూర్ జలాశయం నుంచి ఊట్కూర్ పెద్ద చెరువుకు నీటిని తరలించి, అక్కడి నుంచి జయమ్మ చెరువుకు నీటిని పంపింగ్ చేసేందుకు ఊట్కూర్ మండలం బాపురం శివారులోని సర్వే నంబర్ 25, 26లో రైతులకు సంబందించిన వ్యవసాయ పొలాల్లో సాయిల్ టెస్టు సర్వే పనులను ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు.
మంగళవారం పొలాల్లో చేపట్టిన ఈ పనులను రైతులు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఎలా హద్దులు గుర్తిస్తారంటూ మండిపడ్డారు. సీఎం సొంత జిల్లాలో ప్రాజెక్టు పనులను అడ్డుకోవడంతో తహసీల్దార్ చింత రవి హుటాహుటిన అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. తమ పొలాల్లో పనులను చేపట్ట వద్దంటూ బాపురం, తిప్రాస్‌పల్లి గ్రామాల రైతులు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. మరోపక్క అధికారులు రైతులు లేని సమయం చూసి కెనాల్ నిర్మాణానికి హద్దులు గుర్తిస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే తప్పించుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు ముఖ్యమంత్రి స్పందించి తమ భూములు పోకుండా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.