మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 27 : గోవాలో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఓబీసీ ముఖ్య సలహాదారు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. సోమవారం గోవా మాజీ ఉప ముఖ్యమంత్రి, కురుమ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీబాబు కవ్లేకర్, ఆ రాష్ట్ర మంత్రి సుభాష్శిరోద్కర్ను ఆయన కలిసి ఓబీసీల సమస్యలపై చర్చించారు.
ఇతర రాష్ర్టాల్లో మాదిరిగా వైద్యవిద్య, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. శ్రీబాబు కవ్లేకర్, సుభాష్శిరోద్కర్ సానుకూలంగా స్పందించారు. సమాజ్ ఓబీసీ నాయకుడు బండారిగౌడ్, రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు మధు అనంతనాయక్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి సర్వేశ్ తదితరులు ఉన్నారు.