హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలపై చర్చించేందుకు నేషనల్ వాటర్ డెవలప్మెం ట్ అథారిటీ ఈ నెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో అథారిటీ చైర్మన్ భోపాల్‌సింగ్ నేతృత్వం లో సమావేశం కొనసాగనున్నది. ఈ మేరకు తెలంగాణ అధికారులకు ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు సమాచారమిచ్చారు.
జీసీ రివర్ లింక్ ప్రాజెక్టును ప్రధానంగా ఎక్కడినుంచి చేపట్టాలనే అంశంపై సుదీర్ఘకాలంగా చర్చ కొనసాగుతున్నది. తొలుత సమ్మక్కసాగర్, ఆ తర్వాత ఇచ్చంపల్లి నుంచి నీటి మళ్లింపుకోసం ప్రతిపాదనలు చేశారు. ఎన్‌డబ్ల్యూడీఏ బోర్డు సమావేశంలో కొత్తగా ఇంద్రావతి నుంచి కూడా తరలింపుపై ప్రతిపాదించారు. ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో 9 న సమావేశం నిర్వహించి సందేహాలు నివృత్తి చేయాలని ఎన్‌డబ్ల్యూడీఏ నిర్ణయించింది.
సీతారామ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌పై చర్చించేందుకు 6న నిర్వహించ తలపెట్టిన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ రాసింది. సీతారామ ఎత్తిపోతల పథకం- సీతమ్మసాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు డీపీఆర్ జీఆర్ఎంబీకు ఇప్పటికే చేరింది.
కేంద్ర జలశక్తిశాఖ రివర్ బోర్డుల గెజిట్‌లోని ఫ్లో చార్ట్‌ను అనుసరించి ప్రాజెక్టు డీపీఆర్‌పై చర్చించాల్సి ఉంటుంది. అనంతరం బోర్డు అభిప్రాయాలతో డీపీఆర్‌ను జీఆర్ఎంబీ తిరిగి సీడబ్ల్యూసీకి పంపాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా డీపీఆర్‌ను బోర్డుకు సీడబ్ల్యూసీ ఇటీవలే పంపింది. దీనిపై చర్చించేందుకు 6న సమావేశం నిర్వహించాలని బోర్డు నిర్ణయించగా సెప్టెంబర్‌కు వాయిదా వేయాలని ఏపీ విజ్ఞప్తి చేసింది.