హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో చేపట్టిన నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల్లో సమతుల్యత లోపించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లోని పెద్ద దవాఖానల నుంచి నర్సింగ్ ఆఫీసర్లను భారీ సంఖ్యలో జిల్లాలకు బదిలీ చేసిన ప్రభుత్వం వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడంతో వైద్య సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి కీలక దవాఖానాల నుంచి నర్సింగ్ ఆఫీసర్లను భారీ సంఖ్యలో జిల్లాలకు బదిలీ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు రోజూ 1300 నుంచి 1500 మంది రోగులు వస్తుంటారు. ఈ దవాఖానలో మొత్తం మంజూరైన నర్సింగ్ సిబ్బంది పోస్టులు 239 మంది కాగా.. 66 ఖాళీలు ఉన్నాయి. ఇక ఉన్నవారిలో తాజాగా 82 మందిని బదిలీ చేశారు. వీరికి బదులుగా ఇతర ప్రాంతాల నుంచి ఇద్దరు మాత్రమే బదిలీపై ఇక్కడికి వచ్చారు.
నిలోఫర్ దవాఖానకు ప్రతిరోజూ 1000 నుంచి 1200 మంది వరకు పేషెంట్లు వస్తుండగా.. ఇక్కడ మంజూరైన నర్సింగ్ సిబ్బంది పోస్టులు 250. కాగా ఇప్పటికే 124 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. తాజాగా 40 మందిని బదిలీ చేశారు. కానీ వీరికి బదులుగా ఇక్కడికి రావడానికి ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ ముందుకు రాలేదు. ఫీవర్ (కోరంటి) దవాఖానలో ఇప్పటికే 22 ఖాళీలు ఉండగా.. ఉన్న నర్సింగ్ ఆఫీసర్లలో 18 మంది బదిలీపై వెళ్లిపోయారు. ఇక్కడికి కూడా కొత్తగా ఎవరూ రాకపోవడం గమనార్హం. నగరంలోని చెస్ట్ దవాఖాన, పేట్లబుర్జు, సరోజినీదేవి కంటి దవాఖాన, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొన్నది. ఉన్న పోస్టులు ఖాళీ అయిపోగా, కొత్త వారు రాకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతున్నది. హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. అక్కడ 115 ఖాళీలకు గాను ఏకంగా 113 మందిని కొత్తగా బదిలీ చేశారు.
సంగారెడ్డికి కొత్తగా 75 మందిని బదిలీ చేశారు. దీంతో నగరంలోని సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా తరలిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఫోకల్ టు నాన్ ఫోకల్ పేరిట నగరాల్లో అధిక హెచ్ఆర్ఏ (24%) పొందుతున్న వారిని బలవంతంగా తక్కువ హెచ్ఆర్ఏ (11%) వచ్చే ప్రదేశాలకు బదిలీచేసిన ప్రభుత్వం అదే స్థాయిలో నాన్ ఫోకల్ ఏరియాల నుంచి ఫోకల్ ఏరియాలకు సిబ్బందిని బదిలీ చేయలేదని తెలుస్తున్నది. ఇంతకుముందు 2024 జూన్‌లో సైతం ఇదే విధంగా బదిలీలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలామందిని డిప్యుటేషన్‌పై వెనుకకు తీసుకొచ్చినట్టు చెప్పుకొంటున్నారు. ఈ ప్రక్రియలో భారీ ఎత్తున నగదు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. ఒక్కో డిప్యుటేషన్‌కు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ఇప్పుడు కూడా డిప్యుటేషన్ పేరిట వసూళ్ల దందాకు తెరలేపేందుకే నగరం నుంచి సిబ్బందిని భారీగా బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరంలోని కొన్ని దవాఖానల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన నర్సింగ్ ఆఫీసర్లు వివిధ కారణాలు చూపి మళ్లీ ఇక్కడే పోస్టింగులు పొందినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీ నిబంధనల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి 80 శాతం మంది హెడ్‌నర్సులు ‘ఫోకల్ టు ఫోకల్’ (కీలక స్థానాల నుంచి మళ్లీ వారికి అనుకూలమైన స్థానానికి) పోస్టింగులు పొందారని జూనియర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడే తిష్ట వేసిన వారిని కదల్చకుండా అధికారులు రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌లోని పెద్ద దవాఖానల్లో బదిలీల వల్ల ఏర్పడిన స్థానాలను వెంటనే భర్తీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.