హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్22 (నమస్తే తెలంగాణ) : అనాథపిల్లల ఆలనా పాలన చూసే ఆయాలు జీతాలిప్పించండి మహాప్రభో అంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఐదు నెలలుగా వేతనాలందక వారు అష్టకష్టాలు పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతినెలా పడే జీతాలు ఇప్పుడు ఐదు నెలలుగా పడటం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంటి అద్దెలు చెల్లించడంతోపాటు ఇల్లు గడిచేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్తూ వాపోతున్నారు. హైదరాబాద్‌లోని అనాథ పిల్లల సంరక్షణ కేంద్రం శిశు విహార్‌లో సుమారు 200 మంది పిల్లలకు 130మందికి పైగా ఆయాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకమై నిత్యం సేవలందిస్తున్నారు. పనిచేసే సిబ్బందిలో ఒంటరి మహిళలు, వితంతువులే అధికంగా ఉన్నారు.
ప్రతినెలా జీతం వస్తేగానీ కుటుంబం గడవని పరిస్థితి వాళ్లది. కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి నేటి వరకు వేతనాలు అందకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. హరీశ్‌రావు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జీవో 60 అమలు చేయించి ఆయాలకు రూ.15,600 వేతనం ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైన జీవోకు కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తున్నది. జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. సిబ్బంది వేతనాల్లోంచి ఈఎస్ఐ, పీఎఫ్‌లు సైతం కట్టకుండా కాంట్రాక్టర్లు మోసగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయాలు వారాంతపు సెలవులు తీసుకుంటే సెలవు పేరుతో ఆ రోజు జీతం కట్ చేస్తున్నట్టు తెలిసింది.
శిశు విహార్‌లో పనిచేస్తున్న ఆయాలకు వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలంటూ అధికారులందరికీ వినతి పత్రాలిచ్చాం. అనాథ పిల్లలకు సేలందించే వారి జీతాలు ఆపడం దుర్మార్గం. ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు ఇవ్వడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలి.