హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పేద ప్రజలకు ఏటా 100 రోజులపాటు ఉపాధి హామీ పనులు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఉపాధి అడిగిన 15 రోజుల్లో పని కల్పించాలని ఉపాధి హామీ చట్టం లో స్పష్టంగా ఉన్నప్పటికీ ఎక్కడా అమలుకావడం లేదని లిబ్టెక్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలు తీరుతెన్నులను విశ్లేషించిన ఈ నివేదిక.. 100 రోజులపాటు పని పొందిన కుటుంబాల సంఖ్య జాతీయ స్థాయితోపాటు రాష్ట్రస్థాయిలోనూ గణనీయంగా తగ్గినట్టు స్పష్టంచేసింది. రాష్ట్రంలో పూర్తిగా 100 రోజులు పనిచేసిన కుటుంబాల సంఖ్య 1.35 లక్షల నుంచి 93 వేలకు (31.01%) తగ్గిందని, జాతీయ స్థాయిలో ఈ తగ్గుదల 9.5 శాతంగా ఉన్నదని తెలిపింది.
తగ్గిన పనిదినాలు
రాష్ట్రంలో ఉపాధి పనిదినాలు స్వల్పంగా పెరిగినప్పటికీ ఒక్కో ఇంటికి లభించిన సగటు పనిదినాలు 47.71 నుంచి 45.80 రోజులకు (4%) తగ్గాయి. ఎక్కువ మంది పనిచేసినా అందరికీ తగిన స్థాయిలో పని లభించలేదు. పని దినాల కల్పనలో జిల్లా మధ్య వ్యత్యాలు ఉన్నాయి. హైదరాబాద్ మినహా మొత్తం 32 జిల్లాలకుగాను 15 జిల్లాల్లో పనిదినాలు తగ్గా యి. మిగిలిన 17 జిల్లాల్లో మాత్రం పనిదినాలు పెరిగాయి. ములుగు జిల్లాలో 36.5%, కామారెడ్డి జిల్లాలో 24.6%, వరంగల్ జిల్లాలో 24.7% వృద్ధి నమోదవగా.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25.3%, సంగారెడ్డి జిల్లాలో 19.2%, మహబూబాబాద్ జిల్లాలో 18.1% క్షీణత నమోదైంది.
కొత్త కుటుంబాల నమోదు శూన్యం
2024-25లో అధికారులు కొత్తగా ఒక్క కుటుంబాన్ని కూడా ఉపాధి హామీ పథకంలో నమోదు చేయలేదు. 2023-24లో నమోదైన 53 లక్షల కుటుంబాల సంఖ్య అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాంటి పథకాల నేపథ్యంలో జాబ్‌కార్డులను పరిమితంగా మంజూరు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద పనిచేసిన కుటుంబాల సంఖ్య 3.5% మేరకు తగ్గింది.
ఎవరికీ దక్కని రూ.300 కూలి
ఉపాధి కూలీలకు రోజువారీగా రూ.300 చొప్పు న వేతనం ఇవ్వాలని కేంద్రం నోటిఫై చేసినప్పటికీ రాష్ట్రంలో వాస్తవంగా లభించింది రూ.213 మాత్ర మే. నోటిఫై చేసిన కూలి కంటే 29% తక్కువ. ఉపా ధి హామీ కుటుంబాల వార్షిక ఆదాయం రూ.8,637 నుంచి రూ.9,770కి చేరుకున్నప్పటికీ పూర్తి కూలి చెల్లించి ఉంటే వారి ఆదాయం రూ.13,740కు పెరిగేది. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసిన అన్ని కుటుంబాలకు కలిపి రూ.3,666.33 కోట్ల ఆదా యం వచ్చేది. కానీ, తక్కువ కూలి చెల్లించడం వల్ల అది రూ.1,059.32 కోట్లు తగ్గి రూ.2,607.01 కోట్లకే పరిమితమైంది.
రాష్ట్రంలో 21 లక్షల మంది కార్మికుల తొలగింపు
ఉపాధి హామీ పథకంలో నమోదైన కార్మికులను తొలగిస్తున్న అధికార యంత్రాంగం.. కొత్త వారిని తీసుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2024-25లో నిరకంగా 0.91 లక్షల మంది కార్మికులను తొలగించారు. దేశవ్యాప్తంగా 119 లక్షల మంది కొత్త కార్మికులు ఈ పథకంలో చేరినప్పటికీ ఈ విషయంలో తెలంగాణ వెనుకబడింది. గత మూడేండ్లలో రాష్ర్టవ్యాప్తంగా 21 లక్షల మంది కార్మికులను తొలగించారు.