మహబూబాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నాయకుడు నూకల నరేశ్‌రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. నరేశ్‌రెడ్డి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి డోర్నకల్ స్థానాన్ని ఆశించినా టికెట్ దకలేదు. 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా, 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 2012 ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో చేరి 2024 వరకు బీఆర్ఎస్ కోసం సుదీర్ఘ కాలం పనిచేశారు. 2024 ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కేటీఆర్ దిగ్భ్రాంతి
సీనియర్ నేత నూకల నరేశ్‌రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి చెందారు. దవాఖానలో చేరిన నరేశ్‌రెడ్డిని నాలుగైదు రోజుల క్రితమే కేటీఆర్ పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆ కాంక్షించారు. ఆయన మరణవార్త వినా ల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
హరీశ్ తదితరుల నివాళులు..
నూకల నరేశ్‌రెడ్డి మరణవార్త విషయం తెలియగానే మాజీ మంత్రి హరీశ్‌రావు శాసన మండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తదితరులు దవాఖానకు వెళ్లి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నూకల నరేశ్‌రెడ్డి రాజకీయంగా అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.