NSUI | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తేతెలంగాణ): ‘తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూఐకి ఆంధ్రాకు చెందిన నాయకుడెందుకు? ఆయనను వెంటనే తొలగించాలి’ అని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ఎదుట రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యూఐ నాయకులు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెండ్ విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిని మార్చాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు, పార్టీ అధిష్ఠానానికి ఎన్నిసార్లు విన్నవించినా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.
తెలంగాణ ఆవిర్భవించి పదేండ్లు దాటినా ఆంధ్రా నాయకుల కింద పనిచేయాల్సి రావడం దురదృష్టకరమని వాపోయారు. నేటి ఎన్ఎస్యూ ఐ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ పర్యటనపై ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి అనేక కేసు లు ఎదుర్కొన్న తమకు దక్కిందేమిటని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆంధ్రా ప్రాంతానికి చెందిన వెంకటస్వామిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే జాతీయ అధ్యక్షుడు వరుణ్‌చౌదరి తెలంగాణలో పర్యటించాలని తేల్చిచెప్పారు.