NRI | హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): చదువు విలువ తెలిసిన వారు ఖండాంతరాలు దాటి వెళ్లినా సొంతూరిపై ఆ విలువలను వెదలజల్లాలనుకున్నారు. పుట్టిన గడ్డకు మంచి చేయాలన్న తలంపుతో పాఠశాలలను దత్తత తీసుకున్నారు. వారి సొంత ఖర్చులతో రూపురేఖలే మారి నేడు ఆ స్కూళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ఊరిపై లండన్‌లో స్థిరపడిన డాక్టర్ మాధవి, శ్రీకాంత్‌లు మమకారాన్ని పంచి శెభాష్ అని గ్రామస్థుల నుంచి అభిమానం పొందారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రం డాక్టర్ మాధవి, శ్రీకాంత్‌ల సొంతూరు. ఆ ఊరిలో వసతుల లేమితో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాలల గురించి గ్రామస్థుల ద్వారా తెలుసుకొన్న మాధవి, శ్రీకాంత్‌లు వాటిని దత్తత తీసుకున్నారు. లయన్స్ క్లబ్, సుగుణ రామ్మోహన్ ఎడ్యుకేషనల్ సొసైటీల ద్వారా ఆయా పాఠశాలను నేడు ప్రగతిపథంలో నిలిపారు. తొలుత ప్రాథమిక పాఠశాలలో సుమారు రూ.5 లక్షలతో మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.
మాసాయిపేట జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం ఎన్నారైలు డాక్టర్ మాధవి, శ్రీకాంత్‌లు సుమారు రూ.30 లక్షలకు పైగా నిధులను ఖర్చుచేశారు. హైస్కూల్ ఆవరణలో సైన్స్‌ల్యాబ్, గ్రంథాలయాన్ని నిర్మించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బెంచీలను సమకూర్చారు. అన్నిగదులను రంగులతో అలంకరించారు. తరగతి గదుల గోడలపై ఆకట్టుకునేలా విద్యాసంబంధ చిత్రాలను గీయించారు.
పలురకాల పుస్తకాలను అందించారు. సర్వాంగ సుందరంగా తయారైన రెండు పాఠశాలలను సోమవారం జిల్లా కలెక్టర్ సహా ఆయా సంస్థల ప్రతినిధులు ప్రారంభించనున్నారు. 2016లో తలకొండపల్లి జెడ్పీ హైస్కూల్‌ను ఎన్నారైలు డాక్టర్ మాధవి, శ్రీకాంత్ దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం విశేషం.