బెజ్జంకి, ఏప్రిల్ 30: కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి మోసపోయి.. గోసపడుతున్నామని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ఇట్టిపల్లి ఉపాధిహామీ కూలీలు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇల్లంతకుంట మండలానికి వెళ్తున్న రసమయి గురువారం ఇట్టిపల్లి గ్రామశివారులో ఉపాధిహామీ కూలీలను చూసి ఆగి ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా వారు తమ బాధలు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఆయనతో పంచుకున్నారు.
కాంగ్రెస్ ఇస్తామన్న ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, తులం బంగారం, సన్న వడ్ల బోనస్, ఆసరా పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500 హామీలు నమ్మి ఓట్లేసి మోసపోయినట్టు వెల్లడించారు. మళ్లీ కేసీఆర్ సార్ వస్తేనే తమ బతుకులకు భరోసా దొరుకుతుందని తెలిపారు.