Electricity Bills | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : కరెంట్ బిల్లులు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించారు. ఈ రెండు థర్డ్ పార్టీ ఏజెన్సీలు కావడం, ఇవి భారత్ బిల్ పేలో చేరకపోవడంతో ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి జూలై 1 నుంచి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడాన్ని రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలు నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఈ రెండు కూడా భారత్ బిల్‌పే లిమిటెడ్‌లో చేరడంతో తాజాగా టీజీ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వినియోగదారులు ఇక నుంచి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా విద్యుత్తు బిల్లులను చెల్లించే వెసులుబాటు కలిగింది. తెలంగాణతోపాటు, ఏపీ విద్యుత్తు సంస్థల వినియోగదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ఎన్పీసీఐ భారత్ బిల్‌పే లిమిటెడ్ సీఈవో నూపూర్ చతుర్వేది తెలిపారు.
‘ఎస్సీ వర్గీకరణ తీర్పును తిరస్కరించాలి’
హైదరాబాద్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించాలని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ (ఎన్ఏసీడీఏఓఆర్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్ఏసీడీఏఓఆర్ అధ్యక్షుడు అశోక్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకోకుండానే సుప్రీంకోర్టు ఏకపక్షంగా తీర్పును ఇచ్చిందని తెలిపారు. తీర్పును నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ సంఘాలు 21న దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.