నమస్తే తెలంగాణ, నెట్వర్క్, నవంబర్ 29: సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29 తెలంగాణ ప్రజలకు ఎంతో పవిత్రమైన రోజని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. దీక్షాదివస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద సీఎం కేసీఆర్ కటౌట్‌కు ఆయన పాలాభిషేకం చేశారు. అంతకు ముందు స్థానిక తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించారు. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదం వల్లే తెలంగాణ కల సాకారమైందన్నారు. దీక్షకు బయల్దేరిన కేసీఆర్‌ను అరెస్టు చేసిన అల్గునూర్ చౌరస్తా కూడా తమకు ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టకపోతే తెలంగాణ వచ్చేది కాదని, ఈ స్థాయి అభివృద్ధి జరిగేది కాదని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాత మార్చిన విధాత కేసీఆర్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భవిస్తేనే ఇక్కడి ప్రజల గోస తీరుతుందని, రాత మారుతుందని నమ్మిన ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. దీక్షా దివస్‌ను ఘనంగా జరుపుకోవడమంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటడమేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కోట్లాది తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేందుకు కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ రోజు దిక్షా దివస్ అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి క్షీరాభిషేకం చేశారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి రాష్ర్టాన్ని సాధించి సీఎం కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. మంగళవారం దీక్షాదివస్ సందర్భంగా మంత్రి ఈశ్వర్ ‘నమస్తే’తో మాట్లాడుతూ నాటి జ్ఙాపకాలను పంచుకున్నారు. ఆనాటి కేసీఆర్ ఆమరణ దీక్ష అపూర్వ ఘట్టమన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్షా ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. ఆ సమయంలో కేసీఆర్ వెంట నిలిచినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.
దీక్షా దివస్ సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కేక్ కట్ చేస్తున్న టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్. చిత్రంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి స్వామి, కోతి విజయ్, రఘురాం, శివ, వెంకట్‌గౌడ్, చటారి దశరథ్, కరుణాకర్‌రెడ్డి, కృష్ణ, జంగయ్య, సతీశ్, నవీన్‌గౌడ్, వెంకటేశ్, రవి, సుధీర్‌కుమార్, శోభన్‌బాబు, సుందర్, నాగరాజు, ప్రశాంత్, రమేశ్‌గౌడ్, భాస్కర్, మిథున్ప్రసాద్, నాగేందర్, రాజు, రామకృష్ణ, శ్రీను నాయక్ తదితరులున్నారు.
– బౌద్ధనగర్