TSPSC | హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇదీ తెలంగాణ ఉద్యమ నినాదం.. ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరగానే సీఎం కేసీఆర్ ఈ మూడింటిపైనా దృష్టిసారించారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. స్వరాష్ట్రం సాకారమైనప్పటినుంచే ఆ దిశగా రాష్ట్ర సర్కారు అడుగులు వేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని ఏర్పాటు చేసి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఉమ్మడి పాలనలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా, తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా ఆ ఏడాదంతా ఉద్యోగ కల్పన, భవిష్యత్తు ప్రణాళిక, టీఎస్పీఎస్సీని పటిష్ఠం చేయడం తదితర అంశాలపై దృష్టి సారించింది. ఉద్యోగాల భర్తీతోపాటు అనేక కొత్త ఉద్యోగాలను సృష్టించింది. 2015లో టీఎస్పీఎస్సీ ద్వారానే 4,146 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇందులో ఎక్కువ ఉద్యోగాలకు అదే ఏడాది పరీక్షలు సైతం నిర్వహించింది. తెలంగాణ ఏర్పడితే అంతా అంధకారమే అని.. కొత్త ఉద్యోగాలు కల్పనే అని.. ఎంతో మంది భయపెట్టగా, ఒక్క ఏడాదిలోనే 13 నోటిఫికేషన్లు ఇచ్చి సీఎం కేసీఆర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏ లక్ష్యం కోసమైతే ఉద్యమించామో.. ఆ దిశగా తెలంగాణ తొలినాళ్లలోనే అడుగులు వేసింది. ఆ ప్రయాణాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) 23 జిల్లాలకు కలిపి ఏడాదికి 3 వేల ఉద్యోగాలు భర్తీ చేయడమే గగనం. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మొత్తం జనాభా సంఖ్య 10 కోట్లు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి సుమారు మూడున్నర కోట్లు. అంటే.. 10 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ ఏడాదికి కేవలం 3 వేల ఉద్యోగాలలోపు మాత్రమే భర్తీ చేయగా, మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణ ఏడాదికి సుమారు 7 నుంచి 8 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. 2015 నుంచి 2022 వరకు టీఎస్పీఎస్సీ ద్వారా 36,886 ఉద్యోగాలను తెలంగాణ సర్కారు భర్తీ చేసింది. అందులో ఎంతో కీలకమైన గ్రూప్-1 ఉద్యోగాలు 128, గ్రూప్-2 ఉద్యోగాలు 1,032 ఉన్నాయి. అలాగే, 1,058 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు, 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఉద్యోగాల కల్పనలో ఆదినుంచీ అగ్రస్థానంలో నిలిచింది. ఎనిమిదేండ్లలోనే ఏకంగా 108 నోటిఫికేషన్లు ఇచ్చింది. దేశంలో కొత్తగా ఏర్పడి.. ఎనిమిదేండ్లలోనే 36, 886 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసిన ఏకైక రాష్ట్రంగా ఘనత సాధించింది. ప్రస్తుతం 36,886 మంది తెలంగాణలో నిబద్ధతతో ఉద్యోగాలు చేస్తున్నారు.
దేశంలో టీఎస్పీఎస్సీ రికార్డును మళ్లీ టీఎస్పీఎస్సీనే బ్రేక్ చేయబోతున్నది. ఎనిమిదేండ్లలో అత్యధికంగా 36,886 ఉద్యోగాలకు అనుమతి ఇచ్చిన టీఎస్పీఎస్సీ.. కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 17,285 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇందులో కీలకమైన గ్రూప్-1 ఉద్యోగాలు 503, గ్రూప్-2 ఉద్యోగాలు 783, గ్రూప్-3 ఉద్యోగాలు 1,375, గ్రూప్-4 ఉద్యోగాలు 8,180 ఉన్నాయి. వీటితోపాటు జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు 1,392, ఏఈఈ ఉద్యోగాలు 1,540, ఏఈ ఉద్యోగాలు 837తోపాటు మిగిలిన ఉద్యోగాలు ఉన్నాయి. కొత్తగా మరో ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ సిద్ధంగా ఉన్నది. అంటే, 2022, 2023.. రెండేండ్లలోనే సుమారు 23 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తున్నది. కమిషన్‌లో కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ, పరీక్షలన్నీ ఈ ఏడాదే పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఆ దిశగా ఇప్పటికే ప్రణాళికలు కూడా రచించింది. త్వరలోనే మిగిలిన మరో ఐదువేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లతోపాటు మిగిలిన పరీక్షలకు తేదీలను ప్రకటించేందుకు కమిషన్ కసరత్తు చేస్తున్నది.
దేశంలోనే అతి తక్కువ సమయంలో ఎక్కువ ఉద్యోగాల భర్తీ ప్రక్రియతో టీఎస్పీఎస్సీ రికార్డు సృష్టించింది. తొమ్మిదేండ్లలోనే సుమారు 60 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడుతున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. దేశంలోని మిగిలిన పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏడాదికి సగటున 2 నుంచి 3 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తున్నాయి. యూపీపీఎస్సీ ఏడాదికి సుమారు 3 వేల ఉద్యోగాలే భర్తీ చేస్తున్నది. టీఎస్పీఎస్సీ మాత్రమే మిగిలిన కమిషన్లతో పోలిస్తే ఏడాదికి సగటున 2, 3 రెట్ల ఉద్యోగాలు ఎక్కువగా భర్తీ చేస్తున్నది. దేశంలోని మిగిలిన కమిషన్లు సైతం టీఎస్పీఎస్సీ విధానాలను అనుసరిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ తీసుకొన్న ఓటీఆర్, జంబ్లింగ్, బయోమెట్రిక్ తదితర అనేక విషయాలను కొనియాడుతున్నాయి. కానీ, రాజకీయ నేతలు మాత్రం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగడం లేదని, లేక లేక ఒక్కసారి నోటిఫికేషన్లు ఇస్తే లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. మిగిలిన రాష్ర్టాల్లో ప్రతి నోటిఫికేషన్‌కు అనేక విమర్శలు వస్తున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల్లో అనేక పేపర్ లీకేజీ ఉదంతాలు వెలుగు చూశాయి. కానీ, తెలంగాణలో మాత్రం ఒక్క ఆరోపణ కూడా లేకుండా వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును పెద్ద బూచీగా చూపుతూ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. తెలంగాణ యువతను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదాన్ని మొత్తం వ్యవస్థకు ఆపాదిస్తూ అప్రదిష్టపాలు చేస్తున్నాయి. ఇకనైనా ప్రతిపక్షాలు కళ్లు తెరిచి.. నిజాన్ని గ్రహించి… యువత భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దని మేధావులు, విద్యావేత్తలు కోరుతున్నారు.
29