Land Acquisition | హైదరాబాద్, మార్చి 13 ( నమస్తే తెలంగాణ): హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వదలడం లేదు. పారిశ్రామికవాడల ఏర్పాటు పేరుతో వరుసగా భూసేకరణ నోటిఫికేషన్లను జారీచేస్తూ రైతులను ఆందోళనలకు గురిచేస్తున్నది. రంగారెడ్డి జిల్లా కొంగరఖుర్ద్లో 277 ఎకరాల అసైన్డ్ భూముల సేకరణకు బుధవారం నోటిఫికేషన్ జారీచేయగా.. తాజాగా గురువారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పరిధిలో 157.23 ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించేందుకు సర్కారు నోటిఫికేషన్ జారీచేసింది. మొత్తం 98 మంది రైతుల నుంచి ఈ భూములను సేకరించనున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం భూములు సేకరిస్తున్నట్టు, సంబంధిత ప్లాన్ కలెక్టరేట్లో ఉన్నట్టు జిల్లా కలెక్టర్ ఆ నోటిఫికేషన్లో తెలిపారు. ఈ భూముల క్రయవిక్రయాలు, లీజుకి ఇవ్వడం వంటి లావాదేవీలు నిర్వహించకూడదని అందులో పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉన్నవారు 60 రోజుల్లోగా జిల్లా కలెక్టర్, లేక అధీకృత అధికారి సమక్షంలో తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవచ్చని సూచించారు.
రంగారెడ్డి, మెదక్, నల్లగొండ తదితర ఉమ్మడి జిల్లాల్లోని అనేక ప్రాంతాలు హైదరాబాద్కు సమీపంలో ఉండటంతో సహజంగానే ఆ ప్రాంతాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వం పరిశ్రమలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించకుండా హైదరాబాద్ కేంద్రంగా పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో రాజధాని శివారు రైతులకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. కోట్ల రూపాయల భూములకు అరకొరగా నష్టపరిహారం చెల్లిస్తుండటంతో జీవనోపాధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్లలో అత్యధికంగా అసైన్డ్ భూములే ఉండగా, దీనివల్ల ఎక్కువ శాతం దళిత, గిరిజనులే తీవ్రంగా ప్రభావితమవుతుండటం గమనార్హం.
వాస్తవానికి పారిశ్రామిక అవసరాల కోసం వ్యవసాయ యోగ్యం కాని భూములను, ప్రభుత్వ భూములను ఎంపిక చేయాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే సంబంధిత రైతుల అనుమతి మేరకే పంట పొలాలను సేకరించాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రైతులతో సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా భూసేకరణ నోటిఫికేషన్లు జారీచేస్తున్నది. లగచర్ల, దిలావర్పూర్, తిమ్మాపూర్, నాగిరెడ్డిపల్లి, కొంగరఖుర్ద్, తాజాగా గుమ్మడిదలలో ఇదే విధంగా నోటిఫికేషన్లు జారీచేసింది. లగచర్లలో ఏకపక్ష భూసేకరణపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించగా, మిగిలిన ప్రాంతాల్లో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనలను లెక్కచేయకుండా రోజుకో ప్రాంతంలో పోలీసు పహారాలో బలవంతంగా భూసేకరణకు చర్యలు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.