Jeevan Reddy | హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ఊపందుకున్నాయి. రెండుమూడు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నదనే వార్తల నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని స్థానిక రాజకీయాల నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు గుత్తాధిపత్యం కట్టబెట్టడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. అందులో భా గంగా జీవన్‌రెడ్డికి పట్టభద్రుల ఎమ్మె ల్సీ టికెట్ రాకుం డా అడ్డుకునేందుకు ఢిల్లీ అధిష్ఠానంపై ఒత్తిడి చేస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
తిరుగుబాటు మీద రివెంజ్
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిలతోపాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎంఐఎం నుంచి ఎన్నికైన రియాజ్ ఉల్ హసన్ పదవీకాలం మార్చి 29తో ముగియనున్నది. వీటి లో ఉత్తర తెలంగాణ పట్టభద్రుల స్థానం, కరీంనగర్, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. పస్తుతం జీవన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ స్థానం కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. జీవన్‌రెడ్డి ముఖ్యనేత మీద తిరుగుబాటు చేస్తుండటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిం ది. ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేయనున్నట్టు తెలుస్తున్నది.
జీవన్‌రెడ్డికే టికెట్ ఇవ్వాలని తీర్మానం
ఇటీవల పీసీసీ సమావేశం నిర్వహించగా.. సభ్యులందరూ జీవన్‌రెడ్డి పేరునే ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిసింది. తాము ఒకటి తలిస్తే.. సభ్యులు మరొకటి తలవడంతో కంగుతిన్న పీసీసీ నేతలు సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది.
అనూహ్యంగా తెరమీదకి విద్యావేత్త
జీవన్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు కరీంనగర్ జిల్లా కు చెందిన ఓ విద్యావేత్త పేరు అనూహ్యంగా తెరమీదికి వచ్చింది. భారీ మద్దతు తనకున్నదని పేర్కొంటూ ఆయన ఏఐసీసీ పెద్దలను కలవడంతోపాటు పీసీసీ మద్దతు కోరినట్టు తెలిసింది. రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.