హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమైనట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకున్న స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జూలై 25న తీర్పును వెలువరించిన న్యాయస్థానం మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించినట్టు సమాచారం.
ఆ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కృష్ణమోహన్‌రెడ్డి, దానం నాగేందర్, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, సంజయ్‌కుమార్, మహిపాల్‌రెడ్డిపై అనర్హత వేటువేయాలని బీఆర్ఎస్ కోరింది. వారందరికీ నోటీసులు ఇచ్చి, వివరాలు తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా వీరిలో కొందరు తాము కాంగ్రెస్‌లో చేరలేదని ప్రకటించారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. తనకు ఎటువంటి నోటీసులు రాలేదని చెప్పారు. భద్రాచలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగానే ఉన్నట్టు తెలిపారు. అటువంటి పరిస్థితి వస్తుందని అనుకోవడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.