హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తేతెలంగాణ) : 314 రైస్ మిల్లుల్లో 5.40లక్షల టన్నుల ధాన్యం మాయమైనట్టు పౌరసరఫరాల శాఖ గుర్తించింది. ఈ ధాన్యం రికవరీకి సదరు మిల్లులపై చర్యలకు ఉపక్రమించింది. నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ కలెక్టర్లకు లేఖ రాశారు. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించి 38లక్షల టన్నుల ధాన్యాన్ని గతేడాది జనవరిలో పౌరసరఫరాల సంస్థ వేలం ద్వారా విక్రయించింది. వేలంలో పాల్గొని ధాన్యాన్ని దకించుకున్న బిడ్డర్లు.. మిల్లర్ల నుంచి 25 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకున్నారు. మిగిలిన ధాన్యానికి సంబంధించి ఆయా మిల్లుల్లో ధాన్యం నిలువలు లేనట్టుగా పౌరసరఫరాల సంస్థకు బిడ్డర్లు ఫిర్యాదు చేశారు. స్పందించిన పౌరసరఫరాల సంస్థ తనిఖీలకు ఆదేశించింది. ఆ తనిఖీల్లో 314 రైస్ మిల్లుల్లో 5.40 లక్షల టన్నుల ధాన్యం లేదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోన్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు సంస్థ ఆయా మిల్లర్లపై చర్యలకు ఉపక్రమించింది. చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు 25శాతం జరిమానాతో ధా న్యాన్ని రికవరీ చేయాల్సిందిగా సూచించారు.