హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరంపై విచారణ పేరుతో కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు.. కుతంత్రాలు చేసినా, అబద్ధాలు ఆడి దుష్ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నోటీసులు జారీ చేశారని ఆరోపించారు.