హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్.. పార్టీ ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీచేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కు నోటీసులు పంపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదుచేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీ జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, చింతా ప్రభాకర్‌కు కూడా నోటీసులు అందజేశారు.
ఈ వివాదంలో మరిన్ని ఆధారాలు సమర్పించాలని స్పీకర్ ఇరుపక్షాలకు సూచించారు. ప్రస్తుతం ఉన్న ఆధారాలు సరిపోవని, అదనపు డాక్యుమెంట్లు లేదా సాక్ష్యాలు అవసరమని నోటీసుల్లో పేరొన్నారు. నోటీసులు అందిన మూడురోజుల్లో సమాధానాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసుల్లో సూచించారు. కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ ప్రక్రియను స్పీకర్ ప్రసాద్‌కుమార్ మొదలుపెట్టనున్నారు. డిఫెక్షన్ చట్టం కింద ఈ విచారణ జరగనున్నది. ఇప్పటికే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో త్వరలోనే విచారణ సెషన్లు ప్రారంభమవుతాయని అధికారవర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురానున్నాయి. బీఆర్ఎస్ నాయకత్వం ఈ నోటీసులను స్వాగతిస్తూ, తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హత వేటు ఎదురోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నది.
పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం జూలై 31న తీర్పు వెలువరించింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై తేల్చాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీచేసింది. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.