హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : నిత్యం ప్రజాసమస్యలపై పోరాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులతో బద్నాం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుయుక్తులతో కుట్రలకు దిగుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆ యన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏడా ది పాలనలో రేవంత్ అన్నింటిలోనూ విఫలమయ్యారని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతుభరోసాపై అన్నదాతలు ఆగ్రహిస్తున్నారనే, ఫార్ములా వన్ కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్‌ను విశ్వవ్యాప్తం చేసిన కేటీఆర్‌పైనే కేసులు పెట్టడం రేవంత్ దుష్టపాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని మధుసూదనాచారి గుర్తు చేశారు. అదే తరహాలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి కోతలు, కూల్చివేతలు తప్ప మరేం చేతకావడంలేదని మండిపడ్డారు. పదేండ్ల పాలనలో దేశంలో ఏ ప్రభుత్వానికి రానన్ని అవార్డులు, రివార్డులు సాధించిన ఘనత కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వ వేధింపులను ఆపకుంటే బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపుతామని మధుసూదనాచారి హెచ్చరించారు.