గద్వాల, జూన్ 28 : జూరాల ప్రాజెక్టుకు ఏమీ కాలేదని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మరో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఇరిగేషన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ శనివారం జూరాల ప్రాజెక్టును పరిశీలించారు. అంతకుముందు ర్యాలంపాడు రిజర్వాయర్‌ను సందర్శించారు.
తర్వాత పీజేపీ డ్యాం వద్దకు చేరుకొని జూరాల ప్రాజెక్టుపైకి ఎక్కి రోప్స్ తెగిన గేట్లను పరిశీలించారు. జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం జూరాల బ్రిడ్జిపై భారీ వాహనాలు తిరగడంతో బ్రిడ్జికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని తెలిపారు. అందుకే నూతన బ్రిడ్జి నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించి వారం రోజుల్లో జీవో విడుదల చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని స్పష్టంచేశారు.
అలంపూర్ చౌరస్తా, జూన్ 28 : ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని, ఈ పథకంలోని మల్లమ్మకుంట, వల్లూరు, జూలకల్లు రిజర్వాయర్లను పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటిని అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కోరారు. శనివారం జూరాలకు వచ్చిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే విజయుడు వినతిపత్రాన్ని అందజేశారు.