హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీ కాని రైతుల కోసం ఈ బడ్జెట్లో నయాపైసా నిధులు కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ ముగిసిన కథ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి, రూ.2 లక్షల వరకు రుణాలు కలిగిన 42 లక్షల మంది రైతులకు రూ.31వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు 25.35 లక్షల మందికి రూ.20,616 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. సీఎం హామీ ప్రకారం, ఇంకా 16.65 లక్షల మంది రైతులకు రూ.10,384 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. కానీ, 2026-27 వార్షిక బడ్జెట్లో రుణమాఫీకి నిధులు కేటాయించలేదు.
ఈ ఏడాది రైతు నామ సంవత్సరమని ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటికీ, ఆ మరునాడే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేదు. వ్యవసాయరంగానికి పరాభవమే మిగిలింది. గత బడ్జెట్ పోలిస్తే.. ఈసారి సాగుకు కేటాయింపులు రూ.1,260 తగ్గించారు. తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ఇది రూ.24,439 కోట్లుగా ఉండటం గమనార్హం. ఇలా గత ఏడాది మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 8.01% నిధులు కేటాయించగా, ఈసారి 7.15% కేటాయించారు. వ్యవసాయ శాఖకు కేటాయించిన బడ్జెట్లో రూ.18 వేల కోట్లు రైతుభరోసాకు కేటాయించింది. గత బడ్జెట్లో సైతం రైతుభరోసా కోసం రూ.18వేల కోట్లు కేటాయించినప్పటికీ, ఇందులో సగమే పంపిణీ చేసింది. బడ్జెట్ నిధుల్లో రైతుభరోసా పోగా మిగిలేది రూ.5,179 కోట్లు మాత్రమే. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ.1,169 కోట్లు తీసేస్తే, ఇతర పథకాలకు మిగిలింది రూ.4,010 కోట్లు మాత్రమే. ఇందులో యాంత్రీకరణ కోసం రూ.344 కోట్లు, క్రాప్ ఇన్సూరెన్స్‌కు రూ.1,886 కోట్లు, ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు కేటాయించారు. సివిల్ సప్లయ్‌కు రూ.7,366 కోట్లు కేటాయించారు. ఇందులో రేషన్ బియ్యం సబ్సిడీకి రూ.3వేల కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రూ.723 కోట్లు, ధాన్యం బోనస్‌కు రూ.3,500 కోట్లు కేటాయించారు.
ఈ బడ్జెట్లోనూ రైతు కూలీలకు ప్రభుత్వం ధోకా ఇచ్చింది. భూమిలేని రైతుల కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ప్రతిఏటా రూ.12వేలు ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ, అందుకు అవసరమైన నిధులు మాత్రం బడ్జెట్లో కేటాయించడం లేదు. రాష్ట్రంలో భూమిలేని రైతు కూలీలు 25 లక్షల మంది ఉంటారని అంచనా. వీరికి ఆత్మీయ భరోసా కోసం రూ.3వేల కోట్లు అవసరం. కానీ, బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించారు.
రైతుల కోసం నిర్మించిన రైతువేదికల నిర్వహణకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేయలేదు. వీటి నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఇవ్వపోవడంతో ఇప్పటికే పలు రైతువేదికలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని రైతువేదికలు మందుబాబులకు అడ్డాగా మారాయి. మిగిలిన వాటిలో సమావేశాలకు వచ్చిన రైతులకు కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ఏఈవోలే తమ సొంత డబ్బులతో రైతులకు సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి నెలకొన్నది.