హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందడంలేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. గ్రూప్-3 ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాల పంపిణీని శుక్రవారం శిల్పకళావేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సర్కారు బడుల్లో 1.2లక్షల మంది క్వాలిఫైడ్ టీచర్లున్నా నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో 26వేల సర్కారు బడులుంటే, వీటిల్లో కేవలం 16.5లక్షల మందే విద్యార్థులు చదువుతున్నారని వెల్లడించారు. అదే ప్రైవేట్‌లో 11వేల స్కూళ్లుంటే, 33లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్టు తెలిపారు. సర్కారు బడుల కంటే ప్రైవేట్ విద్యాసంస్థల మీద నమ్మకం ఎందుకు పెరుగుతున్నదో అంతా ఆలోచించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. ఓయూ, అశోక్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులు మాట్లాడే విషయాలు తనకు తెలుసని చెప్పారు.మంత్రులు పొన్నం, అజారుద్దీన్, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు.