నిజామాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపు రైతుకు నష్టాలు తప్ప లాభమే లేకుండాపోతున్నది. ఈ సీజన్ ఆరంభం నుంచి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో యార్కెట్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. దళారులకు సర్కారు పెద్దలే తెరవెనుక మద్దతుగా నిలుస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే పసుపు రైతులపై కనికరం చూపించకుండా ఇష్టారీతిన దోచుకుంటున్నట్టు సమాచారం. రైతుల గోడు వినేందుకు ఎవరూ రాకపోవడంతో ఓపిక నశించి ఇటీవల రోడ్డెక్కారు. కలెక్టర్‌తో చర్చించిన తర్వాతే ధర్నా విరమిస్తామని రైతులు భీష్మించడంతో కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ హుటాహుటిన రైతుల వద్దకు వచ్చి చర్చలు జరిపి ధర్నాను విరమింపజేశారు. మార్కెట్ కమిటీలో మూడు గంటల పాటు కూర్చుని కటాఫ్ ధరలను నిర్ణయించారు.
పసుపు కొమ్ము రకానికి క్వింటాల్‌కు రూ.9,500, మండకు రూ.8 వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ వ్యాపారులకు స్పష్టంచేశారు. మార్కెట్ కమిటీ పాలకవర్గం, అదనపు కలెక్టర్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం గంటలు కూడా గడువక ముందే ఉల్లంఘనకు గురైంది. నాణ్యత, తేమ పేరుతో కొర్రీలు పెడుతూ ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నారు. రూ.8 వేలకే కొమ్మును కొంటున్నారు. ఆ ధరకు అంగీకరిస్తే ఇవ్వండి లేదంటే కుదరదంటూ దబాయిస్తుండటంతో మార్కెట్లో నిరీక్షించలేని రైతులు.. ఎంతో కొంతకు అమ్మేసి ఇంటి దారి పడుతున్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ గతంలో చెప్పినట్టుగా క్వింటాకు రూ.25 వేలు అమలైతే పసుపు రైతుకు ఢోకా ఉండదు. దుంపకుళ్లు బారిన పడి పసుపు దిగుబడి 15 క్వింటాళ్లకు పరిమితమవుతున్న తరుణంలో రైతుకు నష్టాలే మిగలనున్నాయి.
పసుపు రైతుల గోడును పాలకులు పట్టించుకోవడం లేదు. ధర లేని సమయంలో ధైర్యం చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు ఇటువైపు రావడం లేదు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి నియోజకవర్గాల్లో భారీగా పసుపు సాగవుతున్నది. వీరెవరూ పసుపు రైతుల బాధలను ఆలకించడం లేదు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నేరుగా కలెక్టర్‌కు ఫోన్‌చేసి మార్కెట్లో దారుణ పరిస్థితులపై ఆరా తీశారు. వ్యాపారుల మోసాలపై దృష్టి సారించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న మోసాలపైనా గళం వినిపించారు. ఎమ్మెల్సీ కవిత సైతం ఫిబ్రవరి 22న మార్కెట్ యార్డును సందర్శించి రైతులపక్షాన నిలబడ్డారు. పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రైతుల మెరుపు ధర్నాపైనా స్పందిం చి పసుపు రైతులకు తానున్నానంటూ భరోసా కల్పించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు స్పందించి రైతులకు ధైర్యం చెప్తుంటే కేంద్ర, రాష్ర్టాల్లో పాలకపక్షాలు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. 2019, 2024లో తమ ఓట్లతో రెండుసార్లు ఎంపీ గా గెలిచిన ఆర్వింద్ తమ మేలు కోసం పాటుపడటం లేదని రైతులు మండిపడుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్టు చెప్తున్నా తమకు ఒనగూరిన ప్రయోజనం ఏమీలేదని రైతులు వాపోతున్నారు.
మేము చాలా ఏండ్ల సంది పసుపు సాగు చేస్తున్నం. గింత దారుణ పరిస్థితులు ఎన్నడు సూడలే. పోయిన ఆదివారం మండ తీసుకొని మార్కెట్‌కొచ్చిన. ఐదారు రోజుల సంది తిప్పుతుండ్రు. ఎవరూ కొంటలేరు. ఏందని అడిగితే ధర తక్కువకు అడుగుతుండ్రు. మొన్నటిదాంక తొమ్మిది వేలు పోయిం ది. ఇప్పుడు ఏడు వేలు చెబుతుండ్రు. గీ ధరలు గిట్లనే ఉంటే గిట్టుబాటు కాదు. ముందటికి పసుపు పెట్టుడు అద్ద అని ఆలోచనజేస్తున్నం.
– రమావత్ మమత, మహిళా రైతు
గిట్టుబాటు ధర కోసం ధర్నా చేసినా ఫలితం లేదు. మొన్న కొంతమందికి రూ.11 వేలు ధర పెట్టిండ్రు. తరువాత రోజు రూ.2 వేలు తగ్గించిండ్రు. ఇట్లా మోసం చేస్తుండ్రనే ధర్నా జేసినం. ఏం ఫాయిదా. పట్టించుకునేటోళ్లు లేరు. రైతులను నిలువునా మోసం చేస్తుండ్రు. మండ మొన్నటిదాకా రూ.8 వేలు నుంచి రూ.9,500 పలికింది. ఇప్పుడు రూ.7,200కు తెచ్చిండ్రు.
– ముత్తెన్న, పసుపు రైతు, గోవింద్‌పేట్