హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాదు.. రాక్షస పాలన నడుస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత వంటి పథకాల కోసం 1.2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత ప్రభుత్వం కులగణన సర్వే చేయించిందని, ఈ వివరాలతో ఆయా పథకాలకు అర్హులను ఎంపిక చేయవచ్చు కాదా? మళ్లీ కొత్తగా దరఖాస్తులు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇంతకుముందు దరఖాస్తులు ఏమయ్యాయి? అని శుక్రవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కాలయాపన కోసమేనా కొత్త దరఖాస్తుల ప్రక్రియ? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో జాబితాలో తమ పేరు రాలేదని పలువురు ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అసలు రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన నడుస్తున్నదని, గ్రామసభలు పూర్తిగా పోలీసుల బందోబస్తు మధ్య సాగుతున్నాయని మండిపడ్డారు.