హైదరాబాద్,జూలై 8 (నమస్తే తెలంగాణ) : నాడు మూడున్నర కోట్ల మంది ప్రజలు ఏదో రకంగా ఉద్యమంలో పాల్గొన్నవారే అని, అందరికీ జాగలు, పింఛన్లు ప్రభుత్వం ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ అమరజ్యోతి కార్యాలయంలో బుధవారం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, కొండా లక్ష్మణ్ ఉద్యానవన, తెలుగు వర్సిటీ, డా బీఆర్ అంబేద్కర్ ఓపెన్‌యూనివర్సిటీ, జయశంకర్ వ్యవసాయ వర్సిటీలకు చెందిన విద్యార్థి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అందరూ తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. నామినేట్ పోస్టులు, 250 గజాల స్థలం, ఉచిత బస్ పాస్‌లు, ఉపాధి అవకాశాలు వంటి సౌకర్యాలు కల్పించాలని పలువురు సమావేశంలో పేర్కొన్నారు. వక్తలు గంటల తరబడి మాట్లాడుతుండటంతో కేకేతో పాటు ఎమ్మెల్సీలు అద్దంకి, ప్రొఫెసర్ కోదండరాం, నాయకులు రాములు నాయక్, మోతె శోభన్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ ఉద్యమకారుల ఎంపిక బాధ్యతను ప్రొఫెసర్ కోదండరాంకు అప్పగించామని తెలిపారు. అర్హులకు న్యాయం చేయాలనేది తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు మానుకోవాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యమ సమయంలో విద్యార్థులు, యువతపై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ‘అభయ హస్తం’ మ్యానిఫెస్టోలో ఉద్యమకారులకు ప్రత్యేకంగా పలు హామీలు ప్రకటించారు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్వహిస్తున్న సమావేశాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఆ హామీలను మరోసారి ఉద్యమకారులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తే సరిపోతుందని పలువురు డిమాండ్ చేస్తున్నారు.