అమరావతి : విజయవాడలో ఏపీ కాంగ్రెస్ కార్యాలయం ( Congress Office ) పై బీజేపీ శ్రేణుల దాడిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) తీవ్రంగా ఖండిం చారు. ఈ ఘటనను బీజేపీ మూకల దాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. యువత భవిత కోసం కాంగ్రెస్ చేస్తున్న శాంతియుత ఆందోళలకు సమాధానం చెప్పే దమ్ములేక, సహనం కోల్పోయి భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గు చేటని ట్విటర్( Twitter ) లో ఆరోపించారు.
స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ దగ్గరుండి గూండాల్లా, రౌడీల్లా వ్యవహరిస్తూ కాంగ్రెస్ శ్రేణులపై దాడులకు ఉసిగొల్పడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని, ఏదిచేసినా చెల్లుతుందని అనుకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు పేపర్ లీకులపై నరేంద్ర మోదీ కామెంట్లున్నాయని విమర్శించారు. అసలు లీకుల సూత్రధారి ప్రధాని నరేంద్ర మోదీయేనని, పాత్రధారి విద్యాశాఖ మంత్రి ప్రధాన్ అని ఆరోపించారు.